చిరంజీవి టాప్.. కానీ ఆ స్థానాన్ని బన్నీ కొట్టేశాడు
టాలీవుడ్‌లో హీరోల ర్యాంకింగ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. గతంలో చిరంజీవి కొన్నేళ్ల పాటు అగ్ర హీరోగా నిలిచినప్పటికీ, తాజా ట్రెండ్ చూస్తే ఆ స్థానం ఇప్పుడూ మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 13 March 2025 5:26 PM ISTటాలీవుడ్‌లో హీరోల ర్యాంకింగ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. గతంలో చిరంజీవి కొన్నేళ్ల పాటు అగ్ర హీరోగా నిలిచినప్పటికీ, తాజా ట్రెండ్ చూస్తే ఆ స్థానం ఇప్పుడూ మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి తర్వాత ఆ స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించాడని, ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా అతని క్రేజ్ తారాస్థాయికి వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిందని, ఇది అతన్ని పాన్ ఇండియా స్టార్‌గా మాత్రమే కాకుండా, గ్లోబల్ లెవల్‌లో స్టార్‌గా నిలబెట్టిందని మల్లారెడ్డి ఇటీవల ఒక కార్యక్రమంలో తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలే మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య గత కొంత కాలంలో వాతావరణం సరిగ్గా లేదు. ఈ క్రమంలో మల్లన్న మాటలు మరీంత వేడెక్కించాయి.
నిజానికి టాలీవుడ్‌లో చిరంజీవి ఎప్పుడూ మెగాస్టార్‌గా ఒక గొప్ప స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, కొత్త తరానికి బన్నీ మరింత కనెక్ట్ అయ్యాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 మూవీ విడుదల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో చిరంజీవి తన సినిమాలతో తెలుగులో రికార్డులను క్రియేట్ చేసి మిగతా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు.
ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న చిరు, తిరిగి రీఎంట్రీ తర్వాత కూడా ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్‌ను అందుకున్నారు. కానీ, అతని తరువాతి చిత్రాలు అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మెగాస్టార్ పట్టు సాదించలేకపోయారు. మరోవైపు, బన్నీ తన సినిమాల కథల ఎంపికలో, మార్కెటింగ్‌లో నూతన మార్గాలను ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో దూసుకెళ్తున్నాడు.
పుష్ప విడుదల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్ సాంగ్స్, సౌత్ నుంచి నార్త్ వరకు జనాల్లో ఆయన స్టైల్‌కు, మ్యానరిజంకు విపరీతమైన ఆదరణ లభించాయి. బాలీవుడ్‌లో సైతం బన్నీ పెద్ద ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పుష్ప 2 పై దేశవ్యాప్తంగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇది బన్నీ స్టార్‌డమ్‌కు మరింత ఊతమివ్వబోతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో, చిరంజీవి తన తాజా చిత్రం విశ్వంభర కోసం సిద్ధమవుతున్నారు. ఆయన క్రేజ్ ఇప్పటికీ స్థిరంగా ఉన్నప్పటికీ, కొత్త తరానికి మరింత కనెక్ట్ అయ్యేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది. పుష్ప వంటి సినిమాలతో బన్నీ మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే తన మార్కెట్‌ను విస్తరిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. మరి ఈ కామెంట్స్ సెగ ఎక్కడివరకు తగులుతుందో చూడాలి.