Begin typing your search above and press return to search.

పాకిస్తాన్‌లో బన్నీకి ఫ్యాన్‌... 'తండేల్‌' స్టోరీకి అదే బీజం

ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కానీ ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు అక్కడ ప్రతి ఒక్కటి విడుదల అయ్యేవి.

By:  Tupaki Desk   |   8 Feb 2025 12:39 PM GMT
పాకిస్తాన్‌లో బన్నీకి ఫ్యాన్‌... తండేల్‌ స్టోరీకి అదే బీజం
X

అల్లు అర్జున్‌కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌డం దక్కించుకున్న అల్లు అర్జున్‌ అంతకు ముందు నుంచే తన సినిమాలతో బుల్లి తెర ద్వారా నార్త్‌ ఇండియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడు. కేవలం ఇండియాలోనే కాకుండా అల్లు అర్జున్‌ సినిమాలు విదేశాల్లోనూ డబ్ అయ్యి బుల్లి తెరపై టెలికాస్ట్‌ అయ్యాయి. దాంతో ఇతర దేశాల్లోనూ అల్లు అర్జున్‌కి అభిమానులు అయ్యారు. చాలా మంది బాలీవుడ్‌ హీరోలకు పాకిస్తాన్‌లో లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు కానీ ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు అక్కడ ప్రతి ఒక్కటి విడుదల అయ్యేవి. ఇప్పటికీ అక్కడి వారు ఏదోలా ఇండియన్‌ సినిమాలు చూస్తూ ఉంటారు.

మ్యాటర్‌లోకి వెళ్తే శ్రీకాకుళంకి చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి వెళ్లి పోయారు. దాంతో ఉగ్రవాదులుగా భావించి మత్స్యకారులను పాకిస్తాన్ ఆర్మీ జైల్లో పెట్టింది. మత్స్యకారులు పాకిస్తాన్‌ జైల్లో ఉన్న సమయంలో కొందరు జైలు సిబ్బంది సాధారణంగా మాట్లాడేవారని, అందులో ఒక వ్యక్తి అల్లు అర్జున్‌ అంటే చాలా అభిమానం అని చెప్పాడట. మత్స్యకారులు తాము అల్లు అర్జున్‌ రాష్ట్రానికి చెందిన వాళ్లం అని చెప్పడంతో అతడు చాలా సంతోషించాడట. పదే పదే అల్లు అర్జున్‌ గురించి అడిగేవాడట. మత్స్యకారులు జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో ఆ పాకిస్తానీ తనకు అల్లు అర్జున్‌ ఆటోగ్రాఫ్‌ కావాలని అడిగాడట.

జైలు నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్‌ ఆటోగ్రాఫ్‌ కావాలని పాకిస్తానీ అడిగాడని తమ ప్రాంతానికే చెందిన కార్తీక్‌ ఆ మత్స్యకారుల్లో ఒకరు చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలతో రచయితగా కొనసాగుతున్న కార్తీక్‌ ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ వారికి చెప్పడం జరిగిందట. కార్తీక్‌ ఆ విషయాన్ని చెప్పిన సమయంలో బన్నీ వాసు, అల్లు అరవింద్‌ ఆ కథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలు పెట్టారట. ఆ కథను తీసుకుని లవ్‌ స్టోరీగా సినిమాను రూపొందిస్తే బాగుంటుందని దర్శకుడు చందు మొండేటి లోతుగా అధ్యయనం చేసి సినిమాను రూపొందించడం జరిగింది. తండేల్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

పాకిస్తాన్‌ జైల్లో ఒక పాకిస్తానీ అల్లు అర్జున్‌ను అభిమానించడం, అతడు బన్నీ ఆటోగ్రాఫ్‌ కోరుకోవడం వల్లే తండేల్‌ సినిమా నేడు మన ముందుకు వచ్చింది. ఇలాంటి ఒక ఐడియా చేయడం నిజంగా చాలా పెద్ద విషయం. ఒక వైపు నిజ జీవిత సన్నివేశాలను చూపిస్తూ మంచి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని చూపించడం ద్వారా దర్శకుడు చందు మొండేటి సక్సెస్‌ అయ్యాడు. ప్రమోషన్‌కి ముందు ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు ఎక్కువగా ప్రమోట్‌ చేయలేదు. పుష్ప 2 వివాదం ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి ఎలాంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా అది దారి తప్పి మళ్లీ విమర్శలు వస్తాయేమో అనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఆ విషయాన్ని చెప్పి ఉండరు. ఇప్పుడు కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ విషయాన్ని చెప్పలేదు. మత్స్యకారుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.