Begin typing your search above and press return to search.

అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి?

సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ ట్వీట్లే కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2024 1:00 PM GMT
అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి?
X

సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ ట్వీట్లే కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దారుణంగా కామెంట్లు పెట్టుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లిన క్షణం నుంచి మెగా అభిమానులు.. బన్నీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. అల్లు అర్జున్ తోపాటు అల్లు అరవింద్ పై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం ఓ ఈవెంట్ లో చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బన్నీ అన్నారు. అప్పటి నుంచి ఓ వర్గం ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. అయితే తాను అలా అనడానికి కారణాన్ని కూడా బన్నీ వివరించారు. అయినా మెగా అభిమానులు ఆ కోపాన్ని వీడడం లేదు. ఏపీ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటన తర్వాత మరింతగా నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చి.. ఆ ఫ్యామిలీకి విలువ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో కొందరు బన్నీ ఫ్యాన్స్ మెగా అభిమానులకు కౌంటర్లు ఇస్తున్నా.. మరికొందరు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు బన్నీ ఏం తప్పు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకుండా అనవసరంగా నిందిస్తున్నారని అంటున్నారు. అందరిలాగే బన్నీకి స్వేచ్ఛ ఉండదా అని అడుగుతున్నారు. తన స్నేహితుడికి మద్దతు పలకడం విషయంలో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.

మెగా అభిమానులు.. తనపై, తన తండ్రిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా ఏం అనకుండా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవికి ఇవ్వాల్సిన సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని చెబుతున్నారు. చిరు కాంపౌండ్ నుంచి వచ్చిన రోజు నుంచి నేటి వరకు ఎప్పుడూ మెగాస్టార్ గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా గౌరవం ఇవ్వాలో ఇస్తున్నారని చెబుతున్నారు.

రీసెంట్ గా జరిగిన మారుతీనగర్ సుబ్రమణ్యం ఈవెంట్ లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో చిరుకు ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన చిరు బర్త్ డేకి అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. ఆ తర్వాత మెగాస్టార్ కూడా థాంక్యూ మై డియర్ బన్నీ అంటూ రిప్లై ఇచ్చారు. అంటే అటు బన్నీ ఎలాంటి గౌరవం ఇస్తున్నారో.. మెగాస్టార్ కూడా అంతే ప్రేమను పంచుతున్నారు. కానీ ఓవరాల్ గా అల్లు అర్జున్ ను కావాలనే కాంట్రవర్సీ లోకి లాగుతున్నారని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.