Begin typing your search above and press return to search.

ఈ మరపు ఏంది పుష్పా?

అందుకే అంటారు మామూలుగా ఉన్నప్పుడు ఫర్లేదు కానీ భారీ సక్సెస్ సొంతం చేసుకున్నప్పుడు మరింత అలెర్టుగా ఉండాలి.

By:  Tupaki Desk   |   13 Dec 2024 4:11 AM GMT
ఈ మరపు ఏంది పుష్పా?
X

అందుకే అంటారు మామూలుగా ఉన్నప్పుడు ఫర్లేదు కానీ భారీ సక్సెస్ సొంతం చేసుకున్నప్పుడు మరింత అలెర్టుగా ఉండాలి. ఎందుకంటే.. అందరి చూపు మన మీదనే ఉంటుంది. విజయోత్సవ వేళ.. ఒద్దిగా ఉండటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయంలో వ్యవహరించే తీరు మీద చాలానే ప్రభావం ఉంటుంది. ఈ విషయాన్ని బన్నీ మిస్ అవుతున్నట్లుగా చేస్తున్న వ్యాఖ్యల జోరు అంతకంతకూ పెరుగుతోంది. మొదటి పార్టు విడుదలైన మూడేళ్ల తర్వాత పుష్ప 2తో బాక్సాఫీసుకు కురుస్తున్న కాసుల వర్షం జోరుకు రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి.

మరోవైపు.. సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా విజయోత్సవాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతా బాగుంది కానీ.. విజయోత్సవాన్ని పురస్కరించుకొని పెడుతున్న వేదికలపై మాట్లాడే వేళ.. అల్లు అర్జున్ తీరును తప్పు పడుతున్నారు. దీనికి కారణం.. ప్రముఖల పేర్లు కొన్నిసార్లు మర్చిపోతుంటే.. మరికొన్నిసార్లు వారి పేర్లను మార్చేయటం పెద్ద కంప్లైంట్ గా మారుతోంది.

మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ.. అల్లు అర్జున్ ఆ విషయంపై ఫోకస్ చేయట్లేదన్న విమర్శ ఉంది. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సుకుమార్ ను.. బండి సుకుమార్ రెడ్డిగా ప్రస్తావించటాన్ని తప్పు పడుతున్నారు. ఎందుకుంటే.. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డు సుకుమార్. మరింత లోతులోకి వెళితే.. ఆయన సామాజిక వర్గానికి.. అల్లు అర్జున్ ప్రస్తావించిన పేరుకు ఉండే సామాజిక వర్గానికి పోలికే లేదంటున్నారు. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ ప్రస్తావించిన ‘బండి సుకుమార్ రెడ్డి ఎవరు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సినిమాలో బ్రాండ్.. బ్రాండ్ అంటూ అదే పనిగా చెప్పే డైలాగ్ కు భిన్నంగా బయట మాత్రం బ్రాండ్ పేర్లు మార్చేయటంపై ఫైర్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సక్సెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవటంపై పలువురు తప్పు పట్టటమే కాదు.. ఎంత వైల్డ్ సక్సెస్ వస్తే మాత్రం.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవటమా? అంటూ కస్సుమంటున్నారు.

ఏపీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఇంటిపేరును మర్చిపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా పుష్ప దర్శకుడు.. బన్నీకి ఇంతటి భారీ సక్సెస్ ను సొంతమయ్యేలా చేసిన సుకుమార్ ఇంటి పేరుతో పాటు.. ఆయన తగిలించిన రెండు అక్షరాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక నుంచైనా మరింత కేర్ ఫుల్ గా ఉండాలంటున్నారు. మరి.. బన్నీ ఈ సూచనను వింటున్నారా? వారి వేదనను అర్థం చేసుకుంటున్నారా?