వారికి అల్లు అర్జున్ వార్నింగ్.. ఫ్యాన్స్‌కు కీలక అప్పీల్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతిచెందడంపై చెలరేగిన వివాదం రోజురోజుకూ గాలివానలా తయారవుతోంది.
By: Tupaki Desk | 22 Dec 2024 10:58 AM GMTసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతిచెందడంపై చెలరేగిన వివాదం రోజురోజుకూ గాలివానలా తయారవుతోంది. ఇప్పటికే ఈ కేసులో సినీనటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా.. థియేటర్ యజమానితోపాటు మరికొందరు ఇంకా రిమాండులోనే ఉండిపోయారు.
ఈ వివాదం కాస్త.. పొలిటికల్‌కు దారితీస్తుండడంతో అల్లు అర్జున్ కీలక అప్పీల్ చేశారు. నిన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకుండా సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఘటన జరిగినప్పటి నుంచి తను పడుతున్న వేదనను వివరించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై క్లారిటీ ఇచ్చారు. తాను థియేటర్ వద్ద ఎలాంటి ర్యాలీలు చేపట్టలేదని చెప్పారు. అనుకోకుండా జరిగిన ప్రమాదమని, అందులో తన ప్రమేయం ఏమీ లేదని అన్నారు.
అయితే.. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడడంపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ నడుస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ ముసుగులో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై వ్యతిరేక కథలు అల్లుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ అప్పీల్ చేశారు. సంధ్య థియేటర్ ఘటన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ‘మీ అభిప్రాయాలను పద్ధతిగా చెప్పాలని.. ఎవరినీ దూషించే విధంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బి హేవ్ చేయొద్దు’ అని బన్నీ కోరారు.
‘నా ఫ్యాన్స్ వారి అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలి. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫ్యాన్స్‌కి సూచిస్తున్నాను’ అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ ట్వీట్‌ను నెటిజన్లు స్వాగతించారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టి తన అభిమానులు కేసుల్లో ఇరుక్కోవద్దంటూ అప్పీల్ చేయడం మంచి పరిణామం అని కామెంట్లు పెట్టడం కనిపించింది.