ఎన్టీఆర్ - చరణ్ ఆకట్టుకోలేదు, అల్లు అర్జున్ ఏం చేస్తాడో..?
అయితే ఇటీవల కాలంలో మన హీరోల స్టామినాకి తగ్గ కొరియోగ్రఫీ చేయడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 14 Oct 2024 6:08 AM GMTటాలీవుడ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసే హీరోలు చాలామందే ఉన్నారు. స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి కథానాయకులు తమ డ్యాన్స్ లతో ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఎంత పెద్ద కష్టమైన స్టెప్పులనైనా, మంచి ఈజ్ తో వేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మన హీరోల స్టామినాకి తగ్గ కొరియోగ్రఫీ చేయడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాల్లో ఈ మధ్య కొరియోగ్రఫీ చాలా రిపీట్ గా అనిపిస్తోంది. డ్యాన్స్ ల్లో క్రియేటివిటీ, కొత్తదనం ఉండటం లేదు. ఎంత మంచి సాంగ్ పడినా సరే, కొరియోగ్రఫీ విషయంలో మాత్రం నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఏవో ఒకటి రెండు పాటలు హిట్ అయ్యాయి తప్పితే, చాలా పాటల్లో డ్యాన్స్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొరియోగ్రాఫర్లు తమ హీరో రేంజ్ కు తగ్గ స్టెప్పులు కంపోజ్ చేయడం లేదని అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు.
'దేవర 1' సినిమాలో ఎన్టీఆర్ డ్యాన్స్‌లకు మిశ్రమ స్పందన వచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన 'దావుడి' పాటలో స్టెప్పులు రొటీన్‌గా అనిపించాయి. ఫాస్ట్ బీట్ కు తగ్గట్టుగా తారక్ తన డ్యాన్స్ మూమెంట్స్ తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు కానీ, కొత్తదనం కనిపించలేదు. చార్ట్ బస్టర్ గా నిలిచిన 'చుట్టమల్లె' పాటలో ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ కెమిస్ట్రీ, పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కంపోజ్ చేసిన సింపుల్ స్టెప్స్ మాత్రం ఏమంత గొప్పగా అనిపించలేదు.
'ఆయుధ పూజ' సాంగ్‌లో ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ప్రశంసలు దక్కాయి. గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులు చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో తారక్ డ్యాన్స్ తో పాటుగా తన ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసాడు. రత్నవేలు కెమెరా వర్క్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో గణేష్ ఆచార్య 'రా మచ్చా' పాటకు కంపోజ్ చేసిన స్టెప్పులు పెద్దగా ఆకట్టుకోలేదు. కలర్ ఫుల్ విజువల్స్ ఉన్నప్పటికీ, కొరియోగ్రఫీ మాత్రం ప్రభావం చూపలేదు.
అయితే 'గేమ్ ఛేంజర్' సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, ఆయన క్యారక్టర్ కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేసారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అంతకముందు వచ్చిన 'జరగండి' సాంగ్ డ్యాన్సులకు కూడా మిశ్రమ స్పందన వచ్చింది. శంకర్ మార్క్ గ్రాండియర్ కనిపించినప్పటికీ, ప్రభుదేవా మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఏమంత ఎఫెక్టివ్ గా లేవనే కామెంట్స్ వచ్చాయి. ఇక 'పుష్ప 2' సినిమాలో 'పుష్ప పుష్పరాజ్' పాట కొరియోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ పోలంకి, శ్రేష్టి వర్మ కంపోజ్ చేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.
'పుష్ప: ది రూల్' చిత్రంలోని 'సూసేకి' పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేయబడిన లిరికల్ సాంగ్ వీడియోని స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ - రష్మిక మందన్నలతో ఎలాంటి డ్యాన్సులు వేయించాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో 'పుష్ప 1' లో గణేష్ ఆచార్య వర్క్ చేసిన 'దాక్కో దాక్కో మేక' 'ఊ అంటావా మావా' పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ పాటల్లో డ్యాన్స్ ఎలా ఉంటుందో? బన్నీ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.