పుష్ప 2 రీలోడ్‌ని రీ విజిట్ చేస్తారా?
సంక్రాంతికి ముందు రావాల్సిన పుష్ప 2 రీలోడ్ వర్షన్‌ను నేటి నుంచి అంటే జనవరి 17 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
By: Tupaki Desk | 17 Jan 2025 6:31 AM GMTఅల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల అయ్యి నెలన్నర దాటింది. సాధారణంగా నాలుగు వారాలు కాగానే ఎంత పెద్ద హీరో సినిమా అయినా, ఎంత పెద్ద హిట్ బొమ్మ అయినా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. కానీ పుష్ప 2 సినిమా నాలుగు వారాలు కాదు ఆరు వారాలు అవుతున్నా ఇంకా థియేటర్ల నుంచి ఓటీటీకి రాలేదు. పైగా మరోసారి జనాలను థియేటర్లకు రప్పించేందుకు గాను పుష్ప 2 ని రీ లోడ్ చేస్తున్నాం అంటూ 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించారు. జనవరి 11 నుంచి సంక్రాంతి సినిమాలకు పోటీగా పుష్ప 2 రీ లోడ్ వర్షన్ థియేటర్లలో సందడి చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.
సంక్రాంతికి ముందు రావాల్సిన పుష్ప 2 రీలోడ్ వర్షన్‌ను నేటి నుంచి అంటే జనవరి 17 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను జోడించడం మాత్రమే కాకుండా సినిమా టికెట్ల రేట్లను చాలా తక్కువ చేశారు. నైజాం ఏరియాలో పుష్ప 2 ను సింగిల్ స్క్రీన్‌లో చూడాలి అంటే రూ.112లు, మల్టీప్లెక్స్‌లో చూడాలంటే రూ.150లు చెల్లిస్తే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలు, చిన్న సినిమాలకు సైతం పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు ఉంటున్నాయి. కానీ పుష్ప 2 కి నార్త్ ఇండియాలోనూ టికెట్ల రేట్లను తగ్గించడం ద్వారా ప్రేక్షకుల మళ్లీ థియేటర్లకు వస్తారని ఆశ పడుతున్నారు.
ఇప్పటికే పుష్ప 2 సినిమాను మెజార్టీ ప్రేక్షకులు చూశారు, కొందరు పైరసీ చూశారు. అయినా చాలా నమ్మకంతో పుష్ప 2 రీ లోడ్ వర్షన్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రయోగం జరగలేదు. ఆరు వారాల తర్వాత 20 నిమిషాల ఫుటేజ్‌ను యాడ్ చేయడం ద్వారా ఎంత వరకు ఫలితం దక్కుతుంది అనేది చూడాలి. రెగ్యులర్ ప్రేక్షకులు రీ లోడ్ వర్షన్‌ను చూడాలి అని పెద్దగా అనుకోక పోవచ్చు. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ముఖ్యంగా పుష్ప సిరీస్‌ను ఇష్టపడే వారు కచ్చితంగా రీలోడ్ వర్షన్‌ను చూసేందుకు థియేటర్‌లను రీ విజిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా మేకర్స్ మొదటి నుంచి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సినిమా కంటెంట్‌కి తగ్గట్లుగా ప్రమోషన్ చేయడం ద్వారా వసూళ్లు రూ.1800+ కోట్లు నమోదు అయ్యాయి. ఇప్పటికే బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్ చేసిన పుష్ప 2 ఇప్పుడు దంగల్ పై దృష్టి పెట్టింది. టికెట్ల రేట్లను తగ్గించి, 20 నిమిషాల కొత్త కంటెంట్‌ను యాడ్ చేయడం అనేది కచ్చితంగా చాలా పెద్ద విషయం. కనుక మరోసారి పాన్ ఇండియా మొత్తం సినిమాకు రెండు మూడు రోజులు సాలిడ్ వసూళ్లు నమోదు అయితే కచ్చితంగా రూ.2000 కోట్ల మ్యాజిక్ నెంబర్ క్రాస్ చేయడంతో పాటు, దంగల్ రికార్డ్‌ని సైతం బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకటి రెండు రోజుల్లో పుష్ప 2 రీలోడ్ ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.