పుష్ప 2: సింగిల్ స్క్రీన్ టికెట్లకు కొత్త రేటు?
RRR - కల్కి - దేవర తరువాత మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమవుతున్న టాలీవుడ్ సినిమా పుష్ప 2: ది రూల్
By: Tupaki Desk | 18 Nov 2024 5:16 PM GMTRRR - కల్కి - దేవర తరువాత మళ్ళీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమవుతున్న టాలీవుడ్ సినిమా పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్ స్టామినా ఏమిటో ఈ సినిమాతో పూర్తి స్థాయిలో అర్ధమవుతుంది అనేలా బజ్ క్రియేట్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల చేత విజిల్ వేయించేలా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకులలో ఉత్సాహం పెరిగింది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పుష్ప 2 ట్రైలర్‌తో ప్రేక్షకులు సినీ వర్గాలు సినిమా గురించి భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు మొదటి భాగం పుష్ప: ది రైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి నేపథ్యం ఉన్నందున, పుష్ప 2 టికెట్ ధరల విషయంలో కూడా భారీ మార్పులు తీసుకురావాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రేట్లు పెరగడం కొత్తేమి కాదు. అయితే ఆంద్రప్రదేశ్ లో రేటు ఎంత పెరుగుతుంది అనేది ఆసక్తికరమైన అంశం.
గతంలో పుష్ప 1 విషయంలో నిర్మాతలకు సరైన సపోర్ట్ లభించలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి మంచి రేటు ఉండేలా చర్చలు జరుపనున్నారు. సాధారణంగా సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 150-200 రూపాయల మధ్య ఉంటే, పుష్ప 2 కోసం ఈ రేటును 300 రూపాయల వరకు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమాచారం.
టికెట్ ధరలు పెంచడం కోసం మైత్రి నిర్మాతలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఎలాగూ ఎక్స్ ట్రా షోలు బెన్ ఫిట్ షోలకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ఇక టిక్కెట్ ధర విషయంలో అనుకున్నట్లు జరిగితే నిర్మాతలు హ్యాపీ అయ్యే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలకు ఈ తరహా ప్రత్యేకతలు వర్తింపజేశారు. కానీ 300 రేంజ్ లో ఇవ్వలేదు. దేవరకు 250 వరకు ఇచ్చారు. ఇక ఈసారి పుష్ప 2 కోసం ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా, ఈ టికెట్ ధర పెంపు నిర్ణయానికి మంచి స్పందన వచ్చే అవకాశాలున్నాయి. ఆల్రెడీ ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుకుంది. అందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ నటన, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. దీంతో, ప్రీమియమ్ రేట్లను కూడా ప్రేక్షకులు అంగీకరించే అవకాశాలున్నాయి. కానీ వీకెండ్ వరకు 300 రూపాయలు పెట్టి ఆ తరువాత తగ్గిస్తే లాంగ్ రన్ కలెక్షన్లు బాగుంటాయనే అభిప్రాయాలు వస్తున్నాయి.
సింగిల్ స్క్రీన్లలో పెద్ద సినిమాల టికెట్ ధరలు పెరగడం కొత్త విషయం కాదు. కానీ 300 రూపాయల వరకు ధర పెంచడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇప్పటికే ఈ వార్త సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిత్యం భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద స్క్రీన్లలో మాత్రమే చూడాలనే ట్రెండ్‌లో, ఈ పెంపు టికెట్ అమ్మకాలను పెంచుతుందా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.