పుష్ప 2.. రిస్క్ అయినా సరే అస్సలు తగ్గేదేలే!
ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది. అయితే ఈ రేట్లు చూసి 'పుష్ప 2'కి రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 30 Nov 2024 11:29 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2: ది రూల్'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా చుట్టూ నెలకొన్న హైప్ ను బట్టి చూస్తే, బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు అవుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా జీవో జారీ చేసింది. అయితే ఈ రేట్లు చూసి 'పుష్ప 2'కి రిస్క్ చేస్తున్నారేమో అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
'పుష్ప 2' సినిమాకి డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోతో పాటు.. అర్ధరాత్రి 1 గంట షో, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు కూడా తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఈ షోలన్నిటికీ సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచుకోడానికి అవకాశం కల్పించింది. ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు మొదటి నాలుగు రోజులు టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 - 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150.. డిసెంబర్ 17 - 23 వరకూ సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకోడానికి అనుమతి ఇచ్చారు. వీటికి అదనంగా జీఎస్టీ కూడా ఉంటుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణా ప్రభుత్వం అనుమతిచ్చిన రేట్ల పెంపు ప్రకారం 'పుష్ప 2: ది రూల్' సినిమా డిసెంబర్ 4న రాత్రి నుంచి ప్రదర్శించే ప్రీమియర్ షో టికెట్ ధర సింగిల్ స్క్రీన్స్ సుమారు రూ.1121, మల్టీప్లెక్స్ లో రూ.1239 గా ఉండబోతోంది. అలానే మొదటి నాలుగు రోజులు సింగిల్ స్క్రీన్స్ లో సుమారు రూ. 354, మల్టీప్లెక్స్ లో రూ. 531 టికెట్ రేటు ఉంటుంది. ఈ ధరలతో అల్లు అర్జున్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ పెట్టడానికి అవకాశం కలుగుతుంది. అదే సమయంలో కాస్త రిస్క్ కూడా ఉంటుందని అంటున్నారు కానీ, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే ఇదేమంత రిస్క్ అనిపించడం లేదనే మాట కూడా వినిపిస్తోంది.
తెలంగాణలో 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్లు చూసి అభిమానులు వెనకడుగేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ క్రేజీ సీక్వెల్ కోసం వాళ్ళు మూడేళ్లుగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎంత రేటు పెట్టైనా ధియేటర్లలో సినిమా చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రూ.1239 పెట్టి ప్రీమియర్ షోలు చూసే కామన్ ఆడియన్స్ గురించి కూడా ఇక్కడ ఆలోచించాలి. అంత ఖర్చు చేసి సినిమాకి వస్తున్నారు కాబట్టి, కచ్ఛితంగా అంచనాలను అందుకోవాలని కోరుకుంటారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం 'పుష్ప 1' కు మించి ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి టాక్ ఎలా ఉన్నా, భారీ ఓపెనింగ్స్ కు డోకా ఉండదు.
అల్లు అర్జున్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాకి మొదటి నాలుగు రోజులు ఎలాగూ ఫ్యాన్స్ తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఐదో రోజు నుంచి టికెట్ రేట్లు కాస్త తగ్గుతాయి కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా 'పుష్ప 2: ది రూల్' సినిమా కొన్ని వారాల పాటు బాక్సాఫీస్ ను రూల్ చేస్తుందనేది స్పష్టం అవుతోంది. అదే జరిగితే 1000 కోట్ల క్లబ్ అనేది పుష్పరాజ్ కు కేక్ వాక్ అనే చెప్పాలి.