Begin typing your search above and press return to search.

ఒక్క మాటతో వాటన్నిటికీ ఎండ్ కార్డ్ వేసిన బన్నీ!

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Dec 2024 5:30 AM GMT
ఒక్క మాటతో వాటన్నిటికీ ఎండ్ కార్డ్ వేసిన బన్నీ!
X

ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య విబేధాలు వచ్చాయని, మెగా ఫ్యామిలీ అంతా బన్నీకి దూరంగా ఉంటున్నారంటూ రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు నెట్టింట తెగ పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో పవనిజం, అల్లు ఆర్మీ అంటూ తగ్గేదేలే అనే రేంజ్ లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు బన్నీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్లు కనిపిస్తోంది.

"పుష్ప 2: ది రూల్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో, చిత్ర బృందం హైదరాబాద్‌లో గ్రాండ్ గా సక్సెస్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు ఆయన్ను ప్రేమగా బాబాయ్ అంటూ పిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

టికెట్ రేట్ల విషయంలో స్పెషల్ జీవో జారీ చేయడానికి కారణమైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పిన అల్లు అర్జున్.. పర్సనల్ గా కల్యాణ్ బాబాయ్ థ్యాంక్యూ సో మచ్. నిజంగా మీ చొరవతో మమ్మల్ని హత్తుకున్నారు అని అన్నారు. దాంతో 'పుష్ప 2' ప్రెస్ మీట్ జరిగిన ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుపొగిపోయింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే టాపిక్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి.

నిజానికి అల్లు అర్జున్ కు పవన్ కల్యాణ్ వరసకు మామయ్య అవుతారు. తన మేనత్త సురేఖ భర్త అయిన మెగాస్టార్ చిరంజీవికి పవన్ స్వయానా తమ్ముడు. కాబట్టి ఆయన కూడా బన్నీకి మామయ్యే అవుతారు. కానీ అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచీ రామ్ చరణ్, సుష్మితలతో కలిసి పెరగడంతో.. వారు పిలిచినట్లుగానే పవన్ ను 'కల్యాణ్ బాబాయ్' అని పిలవడం అలవాటు చేసుకున్నారు. చిరంజీవిని సైతం 'చికూ బాబాయ్' అని పిలిచేవాడు.

చిన్నప్పుడు పిల్లలకు నోరు తిరక్క ఏదో ఒక విధంగా కొన్ని పదాలను పలుకుతూ ఉంటారు. బహుశా బన్నీకి కూడా అలానే అలవాటు అయ్యుండొచ్చు. కాకపోతే ఇప్పటికీ పవన్, చిరు లను అల్లు అర్జున్ అదే విధంగా పిలుస్తారనే విషయం.. వాళ్ళను దగ్గరగా చూసిన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా ఫంక్షన్స్ లో గౌరవంగా పవన్ కల్యాణ్ గారు, చిరంజీవి గారు అని సంబోధిస్తారు కానీ.. ఇంట్లో మాట్లాడుకునేప్పుడు మాత్రం చిన్నతనంలో పిలిచినట్లే పిలుస్తుంటారు. ఆ సంగతి తెలియనివారు ఇప్పుడు 'పుష్ప 2' ఈవెంట్ లో బన్నీ ‘కల్యాణ్ బాబాయ్’ అని అనడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అంటూ వారి వరసల గురించి చర్చిస్తున్నారు.

ఏదేమైనా అల్లు అర్జున్ తన స్పీచ్ తో అన్ని వివాదాలకు తెర దించాడని, ఇది మంచి పరిణామం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు 'చెప్పను బ్రదర్' అన్న బన్నీ.. ఇప్పుడు పబ్లిక్ గా పవన్ కళ్యాణ్ ని 'బాబాయ్' అంటూ ప్రేమగా సంబోధించడంతో ఇరు వర్గాల అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటి నుంచి మెగా Vs అల్లు ఫ్యాన్ వార్స్ కి కూడా ఎండ్ కార్డ్ పడుతుందని, అభిమానులంతా ఒకే తాటి మీదకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకూ 'పుష్ప 2' సినిమాను చూడని జన సైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్.. థియేటర్లకు తరలి వస్తారని అంటున్నారు. ఇది కొన్ని ఏరియాల్లో వసూళ్లపై ప్రభావం చూపిస్తుందని నిర్మాతలతో పాటుగా ఏపీలో బయ్యర్లు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.