Begin typing your search above and press return to search.

PSలో సంతకం చేసిన బన్నీ.. ఎందుకంటే..

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బన్నీని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

By:  Tupaki Desk   |   5 Jan 2025 7:03 AM GMT
PSలో సంతకం చేసిన బన్నీ.. ఎందుకంటే..
X

హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన ఎలాంటి మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బన్నీని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు.. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

అదే సమయంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కు బన్నీ దరఖాస్తు చేసుకోగా.. స్వీకరించి విచారణ జరిపింది న్యాయస్థానం. రీసెంట్ గా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

సాక్షులను ఏ విధంగా కూడా ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు కూడా చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. అందులో భాగంగా నేడు ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అల్లు అర్జున్.

లోపలకు వెళ్లి సంతకం చేసిన అల్లు అర్జున్.. 10 నిమిషాల తర్వాత చిక్కడపల్లి పీఎస్ నుంచి తిరిగి బయలుదేరి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అంతకుముందు.. అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావొద్దని తెలిపారు.

అయితే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇప్పటికే అల్లు అరవింద్, సుకుమార్ సహా పలువురు ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ పరామర్శించారు.

ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్లి ఆ బాలుడిని పరామర్శిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒకవేళ పరామర్శకు వస్తే మాత్రం.. తమ సూచనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. లేకుంటే ఏం జరిగినా అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మరి బన్నీ కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారో లేదో వేచి చూడాలి.