అల్లు అర్జున్.. సోలోగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడా?
నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ఎంతో కష్టపడ్డాడు.
By: Tupaki Desk | 2 Dec 2024 10:09 AM GMTటాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 'పుష్ప: ది రైజ్' మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' సినిమాతో 1000 కోట్ల క్లబ్ ను టార్గెట్ చేస్తున్నారు. సోలోగానే ఈ మైల్ స్టోన్ మార్క్ ను అందుకోడానికి ప్రయత్నిస్తున్నారు బన్నీ. ఒక్కడే దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు తిరుగుతూ.. కేవలం తన బ్రాండింగ్ తోనే సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకూ పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబయి వంటి మేజర్ సిటీస్ లో 'పుష్ప 2' ఈవెంట్స్ జరిగాయి. అల్లు అర్జున్ అన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. డైరెక్టర్ సుకుమార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల, హీరోయిన్ రష్మిక మందన్న మాత్రమే బన్నీతో కలిసి ప్రచార కార్యక్రమాలకు హాజరైంది. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో ఈవెంట్స్ అన్నీ భారీగా ప్లాన్ చేయడమే కాదు, అందరూ మెచ్చుకునేలా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేశారు.
ఎస్.ఎస్. రాజమౌళి తన RRR సినిమాని ప్రమోట్ చేసుకోడానికి, ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ముఖ్య అతిధులుగా తీసుకొచ్చి గ్రాండ్ గా ఈవెంట్స్ చేశారు. కానీ 'పుష్ప 2' ఈవెంట్స్ లో ఒక్క దానికి కూడా చీఫ్ గెస్ట్ గా ఎవరినీ పిలవలేదు. అల్లు అర్జున్ ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకొని, ఒక్కడే హైలైట్ అయ్యేలా దేశం మొత్తం తిరిగాడు. ఎక్కడికి వెళ్తే అక్కడి భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఎక్కడ చూసినా తన సినిమా గురించే డిస్కషన్ జరిగేలా చేసాడు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా 'పుష్ప 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి కూడా చీఫ్ గెస్ట్ లు ఎవరూ లేరని సమాచారం. ఎప్పటిలాగే అల్లు అర్జున్ ఒక్కడే ఈవెంట్ లో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ప్రమోషన్స్ లో సుకుమార్ కూడా భాగం అవుతారని తెలుస్తోంది. ప్రధాన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా ఈవెంట్ కు రావొచ్చు. ఏదేమైనా కంటెంట్ మీద నమ్మకమో, కొడితే సోలోగానే కొట్టాలని ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ.. అల్లు అర్జున్ 'ఒక్కడే' తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు.
నిజానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ఎంతో కష్టపడ్డాడు. 'గంగోత్రి' సినిమా టైంలో తన లుక్స్ ని ట్రోల్ చేసిన వారితోనే శభాష్ అనిపించుకోవడం వెనుక బన్నీ నిరంతర కృషి, సాధన, పట్టుదల ఉన్నాయి. ఈ క్వాలిటీసే బెస్ట్ యాక్టర్ గా ఆయనకు నేషనల్ ఫిలిం అవార్డ్ ను తెచ్చిపెట్టాయి. సినిమా పట్ల ఆయనకి ఉన్న అంకిత భావమే 'స్టైలిష్ స్టార్' నుంచి 'ఐకాన్ స్టార్' గా మార్చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. 'పుష్ప 2' తర్వాత బన్నీ క్రేజ్, రేంజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ను ఓ వర్గం నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్లి తన మిత్రుడు శిల్పా రవి చంద్ర రెడ్డిని కలిసిన తర్వాత జనసైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయినా వీటికి ఏమాత్రం కుంగిపోలేదు. ఇప్పుడు ''పుష్ప 2: ది రూల్'' సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి యాంటీ ఫ్యాన్స్ కి గట్టిగా సమాధానం చెప్తాడని నమ్ముతున్నారు.