ఈ సారి జాతీయ ఉత్తమ నటుడు ఎవరో?
జాతీయ ఉత్తమ నటుడు అవార్డుపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Feb 2025 11:30 AM GMTజాతీయ ఉత్తమ నటుడు అవార్డుపై కొన్ని నెలలుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` చిత్రానికి గానూ అందుకున్నారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో బన్నీ స్థాయి అంతకంతకు రెట్టింపు అయింది.
అయితే రెండవసారి కూడా జాతీయ అవార్డు బన్నీనే వరిస్తుందంటూ `పుష్ప2` రిలీజ్ అయిన నాటి నుంచి నెట్టింట చర్చ జరుగుతోంది. `పుష్ప-2` లో ని జాతర సన్నివేశాల్లో బన్నీ పెర్పార్మెన్స్ కి మళ్లీ ఉత్తమ నటుడు అవార్డుల లాంఛనమే అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. అయితే అందంగా వీజీ కాదు. `పుష్ప 2` లో బన్నీ పోషించిన పాత్రకు జాతీయ అవార్డు ఏంటనే నెగిటివిటీ కూడా తెరపైకి వచ్చింది.
అక్రమంగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పాత్రలకు కూడా జాతీయ అవార్డులిస్తారా? అంటూ సెటైర్లు గుప్పించిన మేధా వర్గం లేకపోలేదు. బన్నీకిచ్చిన అవార్డు వెనక్కి తీసుకోవాలి? అన్న డిమాండ్ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ రెండవ సారి కూడా జాతీయ అవార్డు వస్తే ఇంకే రేంజ్లో నెగిటివిటీ వ్యక్త మవుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకూ జాతీయ అవార్డులను అత్యధికంగా కమల్ హాసన్, మమ్ముట్టి , అమితాబాచ్చన్ మూడేసి సార్లు అందుకున్నారు.
అయితే ఈసారి జాతీయ అవార్డు రేసులో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇటీవలే ఆయన నటించిన `ఛావా` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ నటననకు దేశమే గర్విస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటుడి రేసులో విక్కీ కౌశల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అలాగే వివిధ పరిశ్రమల నుంచి మరికొంత మంది నటుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ ఉత్తమ నటుడి గౌరవం ఎవరిది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.