చిరు ఇంటికి బన్నీ.. ఆ విషయంపై చర్చ
అయితే తాజాగా అల్లు అర్జున్.. చిరంజీవి ఇంటికి వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ.. తొలిసారి తన మేనమామ ఇంటికి కుటుంబంతో సహా వెళ్లారు.
By: Tupaki Desk | 15 Dec 2024 7:26 AM GMTపుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం.. ఓ మహిళ మృతి చెందడం.. పోలీసులు కేసు నమోదు చేయడం.. అల్లు అర్జున్ ను శుక్రవారం అరెస్ట్ చేయడం.. చంచల్ గూడ జైలుకు తరలించడం.. ఆపై బన్నీ బెయిల్ పై శనివారం విడుదలవ్వడం.. ఇదంతా తెలిసిందే.
అయితే మెగా, అల్లు కుటుంబాల మధ్య కొంచెం దూరం పెరిగినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. బన్నీ అరెస్ట్ తో ఒక్కసారిగా కుటుంబ ఐక్యమత్యం కనిపించిందని చెప్పాలి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొద్దిసేపటికే.. తన షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వెంటనే తన సతీమణి సురేఖతో బన్నీ ఇంటికి వెళ్లారు.
అల్లు అరవింద్ సహా బన్నీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అల్లు అర్జున్ తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డిని ఆయనే పురమాయించినట్లు కూడా సమాచారం. ఆ తర్వాత బన్నీ జైలు నుంచి ఇంటికొచ్చాక.. అక్కడికి శనివారం సురేఖ వెళ్లారు. తన మేనల్లుడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. హత్తుకుని మాట్లాడి పరామర్శించారు.
అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఎంతో కంగారు పడ్డామని, ఆయన (చిరంజీవి) షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చేశారని అక్కడి ఉన్న వారితో సురేఖ తెలిపారు. అలా శనివారం అంతా బన్నీ ఇల్లు.. ప్రముఖుల రాకతో కళకళలాడింది. ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చి అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు. పరిణామాలపై డిస్కస్ చేశారు.
అయితే తాజాగా అల్లు అర్జున్.. చిరంజీవి ఇంటికి వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ.. తొలిసారి తన మేనమామ ఇంటికి కుటుంబంతో సహా వెళ్లారు. ఇంకా కేసు.. విచారణ దశలో ఉన్న వేళ బన్నీ.. మెగాస్టార్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా లాయర్ ను కూడా చిరంజీవినే మాట్లాడారని టాక్ వినిపిస్తుండగా.. భవిష్యత్తు కార్యాచరణపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చిరు ఇంటికి బన్నీ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు వాటిని వైరల్ చేస్తూ తెగ స్పందిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య చిన్న గ్యాప్ ఉన్నట్లు వస్తున్న వార్తలు.. పటాపంచలయిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. కష్టం వస్తే అందరూ ఒక్కటవ్వాలనేది ఎప్పటికైనా నిజమని చెబుతున్నారు.