2025 బర్త్ డే: నిర్మాతగా ఆయనకు గర్వం..ఓ గొప్ప గౌరవం!
సినిమా బిజినెస్ లో తనదైన మార్క్ స్ట్రాటజీతో ముందుకెళ్లడం అరవింద్ ప్రత్యేకత.
By: Tupaki Desk | 10 Jan 2025 11:00 AM GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అల్లు అరవింద్ ప్రస్తానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అప్పుడే కాదు..ఇప్పుడు కూడా అరవింద్ మార్క్ సినిమాలు నిర్మించడం ఆయనకే సొంతం. నవతరం నిర్మాతలకు ఆయనో స్పూర్తి. అరవింద్ స్పూర్తితో ఇండస్ట్రీలో నిర్మాతలుగా సక్సెస్ అయిందో ఎంతో మంది. సినిమా బిజినెస్ లో తనదైన మార్క్ స్ట్రాటజీతో ముందుకెళ్లడం అరవింద్ ప్రత్యేకత. అందుకే నిర్మాణ రంగంలో చెరగని ముద్ర వేసారు.
తాజాగా ఆయన 76వ వసంతంలోకి అడుగు పెట్టారు. నేడు ఆయన పుట్టిన రోజు. అయితే ఈ పుట్టిన రోజు ఆయనకు ఎంతో స్పెషల్. తనయుడు అర్జున్ గొప్ప విజయాన్ని పురస్కరించుకుని వచ్చిన తొలి పుట్టిన రోజు ఇది. 'పుష్ప-2' విజయంతో అర్జున్ పాన్ ఇండియాలో సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 1800 కోట్ల వసూళ్లతో 'బాహుబలి' వసూళ్లను క్రాస్ చేసిన చిత్రంగా 'పుష్ప2' నిలవడం అన్నది తండ్రిగా ఆయనెంతో గర్వపడే సమయమిది.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు అరవింద్ కేక్ కట్ చేసారు. ఆయన సతీమణి, కొడుకులు, కోడళ్లు, మనవల సమక్షంలో ఈవేడుక నిరాడంబరంగా జరిగింది. అల్లు అర్జున్ దగ్గరుండి తండ్రితో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. పుష్పకా బాప్ అంటూ పక్కనే పుష్ప విజయాన్ని సైతం మరోసారి కేక్ కటింగ్ తో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
1949 జనవరి 10న అరవింద్ జన్మించారు. బాల్యం లోనే తండ్రి కష్టాన్ని అర్దం చేసుకున్న తనయుడు అరవింద్. తొలుత తండ్రిలా నటుడు అవ్వాలనుకున్నారు. కానీ పరిశ్రమ ఆయన్ని ఓ గొప్ప నిర్మాతగా తీర్చిదిద్దింది. తాను నటుడిగా పారితోషికం తీసుకోవడం కాదు..నటులకు పారితోషికం ఇచ్చే స్థాయికి నిర్మాతగా ఎదిగారు. గీతా ఆర్స్ట్ సంస్థను నెలకొల్పి దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'బంట్రోతు భార్య' అనే చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా అరవింద్ తొలి అడుగు అదే. అలా మొదలైన అరవింద్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి నిర్మాతగా ఓ శిఖరాగ్రానికే చేరుకున్నారు.
'బంట్రోతు భార్య' నుంచి 'అల వైకుంఠపురములో' వరకూ ఎన్నో చిత్రాలు నిర్మించారు. 1990 లో 'ప్రతిబంద్' సినిమాతో అక్కడా నిర్మాణం మొదలు పెట్టారు. అయితే హిందీలో చేసింది తక్కువ సినిమాలే. చివరిగా 2023లో 'అలవైకుంఠపురములో' చిత్రాన్ని 'షెహజాదా' టైటిల్ తో రీమేక్ చేసారు. తమిళ్ లో సైతం 'మాపిల్లై' అనే సినిమా తో లాంచ్ అయ్యారు. అక్కడా నాలుగైదు సినిమాలు నిర్మించారు. కన్నడలోనూ రెండు చిత్రాలు నిర్మించారు. ఇక నిర్మాతగా ఆయన సాధించాల్సింది ఒక్క పాన్ ఇండియా సక్సెస్ ఒక్కటే. ఇంత వరకూ ఆయన పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టలేదు.