Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌ ఏ పార్టీలోనూ లేడు..!

ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 1:53 PM GMT
అల్లు అర్జున్‌ ఏ పార్టీలోనూ లేడు..!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్‌ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ''పుష్ప 2: ది రూల్''. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా.. ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబరు 5వ తేదీనే విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏపీలో ఎన్నికల తర్వాత మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. 'పుష్ప 2'పై ఈ ప్రభావం పడుతుందేమో అనే చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తాజాగా మైత్రీ నిర్మాతలు స్పందించారు.

'పుష్ప 2: ది రూల్' సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడానికి గురువారం మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్‌మీట్‌ పెట్టారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ లు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ''మెగా, అల్లు ఫ్యామిలీలుగా విడిపోయారనే టాక్ ఉంది. 'పుష్ప 1' మాదిరిగానే 'పుష్ప 2' సినిమాని కూడా మెగా ఫ్యాన్స్ అదే స్థాయిలో తీసుకెళ్లారని అనుకుంటున్నారా?'' అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించింది. దీనికి నిర్మాతలు స్పందిస్తూ వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వాళ్లంతా ఒకటే అని, అభిమానులందరూ ఒకే తాటి మీద ఉన్నారని స్పష్టం చేసారు. రాజకీయంగా అల్లు అర్జున్ కి ఎవరితోనూ సంబంధం లేదని అన్నారు.

నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ.. ''డెఫినిట్ గా వాళ్లంతా ఒకటిగా కలిసే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏవైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగుండొచ్చు కానీ, ఫ్యాన్స్ అందరూ ఒకే తాటి మీద ఉన్నారు. పాలిటిక్స్ ని పక్కన పెట్టి, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నారు'' అని అన్నారు. ఇదే విషయంపై రవిశంకర్‌ స్పందిస్తూ.. ''పొలిటికల్ గా వాళ్ళేమీ డివైడ్ అవ్వలేదు. అల్లు అర్జున్‌ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. రాజకీయంగా విడిపోయారని అనడం సరికాదు. అక్కడ ఏమీ లేదు. అందరూ ఒకటే. మనమంతా సినిమా లవర్స్‌. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తారు. పొలిటికల్‌గా ఆయనకు ఎవరితోనూ సంబంధాలు లేవు'' అని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్‌ కు చెందిన జనసేన పార్టీకి కాకుండా, ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్ చేయడంపై జనసేన కార్యకర్తలు, కొందరు మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. బన్నీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య నిత్యం ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ అప్పుడు జరిగిన చిన్న చిన్న విషయాలకు వాళ్ళేమీ విడిపోలేదని, అందరూ కలిసే ఉన్నారని 'పుష్ప 2' నిర్మాతలు చెబుతున్నారు.

గీతా ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ సైతం ఇటీవల ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. మెగా - అల్లు ఫ్యామిలీ విభేదాలపై స్పందిస్తూ.. ఇవన్నీ తాత్కాలిక ఎమోషన్స్ అని, ఒక్క మీటింగ్ లేదా డిన్నర్ తో అన్నీ ఇట్టే సెట్ అయిపోతాయని అన్నారు. 'పుష్ప 2' ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ కి కూడా కచ్చితంగా ఈ ప్రశ్న ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిపై బన్నీ ఎలాంటి సమాధానం చెప్తారో వినాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.