పుష్ప కార్పొరేట్ ప్రమోషన్స్.. ఆ రూట్లో ఊహించని బిజినెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది.
By: Tupaki Desk | 16 Nov 2024 9:22 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మొదటి రోజు ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ షురూ అయ్యాయి.
త్వరలో మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. 7 ప్రధాన పట్టణాలలో ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ కొత్త పంథాని ఫాలో అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇండియాలో రాజకీయ నాయకులకి విషెస్ చెబుతూ కార్పొరేట్ కంపెనీలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రకటనల ద్వారా సదరు రాజకీయ నాయకుడితో పాటు వారిని ప్రమోట్ చేసిన కార్పొరేట్ సంస్థలకి కూడా కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతుంది.
ఇదే విధానం ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ కి అవలంబిస్తున్నారంట. ఈ సినిమాని దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేయడం కోసం కార్పొరేట్ కంపెనీలతో మేకర్స్ టై అప్ అయ్యారంట. ‘పుష్ప 2’కి ఉన్న హైప్ నేపథ్యంలో వారి ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి స్ట్రాంగ్ గా పంపించుకోవడానికి ఈ మూవీ అడ్వాంటేజ్ అవుతుందని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయని టాక్. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక్కరు 10 నుంచి 20 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తం ఈ సినిమా ప్రమోషన్స్ అన్నింటికి కలిపి 150 కోట్ల వరకు ఖర్చు అవుతుందంట. ఆ మొత్తం కూడా నిర్మాతలు పెట్టడం లేదని, కార్పొరేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారే పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ పాలసీ వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో మరిన్ని కార్పొరేట్ కంపెనీలు తన ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడానికి సినిమాని మాధ్యమంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఇప్పటి వరకు టెలివిజన్, డిజిటల్ మీడియాలో రియాలిటీ షో, టాక్ షోలకి కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ‘పుష్ప 2’తో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కి కూడా స్పాన్సర్స్ గా ముందుకి రాబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.