సుకుమార్ బలంగా కోరుకోవడం వల్లనే వచ్చింది: అల్లు అర్జున్
కేవలం తన కృషి, కష్టం వల్లనే జాతీయ అవార్డు వచ్చిందని నేను అనుకోవడం లేదని, తాను చేసినది 50శాతం మాత్రమే
By: Tupaki Desk | 22 Oct 2023 10:00 AM GMTకేవలం తన కృషి, కష్టం వల్లనే జాతీయ అవార్డు వచ్చిందని నేను అనుకోవడం లేదని, తాను చేసినది 50శాతం మాత్రమే అయితే, ఈ అవార్డు రావాలని కోరుకున్న సుకుమార్, నా చుట్టూ ఉన్న వారి బలమైన కోరిక వల్లనే మిగతా 50 శాతం సాధ్యమైందని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చుట్టుపక్కల పరిసరాలు సహకరిస్తేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని అల్లు అర్జున్ అన్నారు. జాతీయ అవార్డు అందుకోవడానికి ముందే అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ చేసిన ఏకైక ప్రాణమిత్రుడు సుకుమార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రముఖుల కోసం మైత్రి మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీలో అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు.
ఆన్ లొకేషన్ జరిగిన ఒక సన్నివేశం గురించి బన్ని ఈ వేదికపై వివరిస్తూ.. అతి కష్టం మీద అంతగా సౌకర్యం కుదరని మారేడు మిల్లి షెడ్యూల్ లో అరుదైన లొకేషన్ లో ఒక సీన్ తీసి తిరిగి వెళ్లిపోయాం. కానీ మళ్లీ అదే సీన్ కోసం రెండోసారి కూడా వచ్చి షూట్ చేసాం. చిత్రీకరణ చేసేప్పుడు అవసరమైన షాట్స్ తీసుకుని ఇక వెళ్లాలనుకున్నామని, కానీ అప్పటికీ ఆ సన్నివేశం విషయంలో సుకుమార్ సంతృప్తి చెందలేదని అల్లు అర్జున్ అన్నారు. రిస్కీగా ఉన్న చోట సీన్ మరోసారి తీయాలా? అని తాను ప్రశ్నించినపుడు.. సుకుమార్ ఒక మాటన్నారు. ఈ సినిమాతో నాకు ఎంత పేరొస్తుంది. దర్శకుడిగా పేరొస్తుంది. స్క్రీన్ ప్లేకి మంచి పేరొస్తుంది. సినిమ ఎంత పెద్ద హిట్టవుతుంది. ఎంత డబ్బు వస్తుంది. నాకు ఇవన్నీ అనవసరం. కానీ నీకు పేరు రావడం చాలా ముఖ్యం. అందుకే ఈ ప్రయత్నం.. అని సుకుమార్ తనతో అన్నారని బన్ని వెల్లడించారు. సుకుమార్ ఏం చేసినా నిస్వార్థంగా చేస్తాడని, తన స్వార్థం కోసం ఏదీ చేయడని కూడా అల్లు అర్జున్ వెల్లడించారు. సుకుమార్ ఒక అఛీవర్ అని ప్రశంసించారు.
తనతో పాటు జాతీయ అవార్డ్ అందుకున్న దేవీశ్రీ ప్రసాద్ గురించి బన్ని ఒక ఆసక్తికర విషయం తెలిపారు.
మా డాడ్ (అల్లు అరవింద్) ఒక మంచి మాట అన్నారు. నాకు నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డ్ వచ్చిందనిపించింది.. అని డాడ్ అన్నారు. సత్యమూర్తి గారు లేకపోయినా దేవీశ్రీకి తండ్రి హోదాలో అరవింద్ ఈ మాట అన్నారని బన్ని తెలిపారు. చెన్నైలో ఇద్దరు పోరంబో*లు (బన్ని, దేవీశ్రీ)గా తిరిగినవాళ్లు.. ఇలా జాతీయ అవార్డు అందుకోవడంపై అల్లు అరవింద్ ఎంతో ఆనందం వ్యక్తం చేసారని బన్ని సరదాగా వ్యాఖ్యానించారు.
జాతీయ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే.. అదంతా 50శాతం. మన చుట్టూ ఉన్నవాళ్లంతా కోరుకుంటేనే మిగతా 50శాతం సాధ్యమవుతుంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే .. జాతీయ అవార్డ్ రావాలని నాకు కోరిక ఉంది. కానీ నాకంటే సుకుమార్ గారికి ఆ కోరిక ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఉన్నవారందరికీ ఈ కోరిక ఉంది. అందుకే ఇది వచ్చింది.. అని కూడా బన్ని అన్నారు. ఇది నా వల్ల రాలేదు. నా ద్వారా మాత్రమే వచ్చిన అవార్డ్.. అని అన్నారు. అయితే మైత్రి ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుకుమార్ హాజరు కాలేకపోయారు.