Begin typing your search above and press return to search.

అల్లు ఇంట సంబ‌రాలు.. సుక్కూ, బ‌న్నీ కంట‌ క‌న్నీళ్లు!

అల్లు అర్జున్ - సుకుమార్ ఆ క్ష‌ణం ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 6:22 PM GMT
అల్లు ఇంట సంబ‌రాలు.. సుక్కూ, బ‌న్నీ కంట‌ క‌న్నీళ్లు!
X

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ బ‌న్ని-సుక్కూ క‌ళ్ల‌లో క‌న్నీళ్లు క‌నిపించాయి. 'పుష్ప: ది రైజ్‌'లో తన అద్భుతమైన నటనకు బ‌న్నీ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. అల్లు అర్జున్ ఈ విజయంతో చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటనకు జాతీయ అవార్డును తెచ్చిన మొదటి తెలుగు నటుడిగా నిలిచాడు. ఇంత‌కుముందే ఆన్‌లైన్‌లో విడుద‌లైన ఓ వీడియోలో అల్లు అర్జున్ ని ఈ ఆనంద స‌మ‌యంలో త‌న‌ కుటుంబం దర్శకుడు సుకుమార్‌ సహా పుష్ప బృందం చుట్టుముట్టింది. పుష్పరాజ్ అనే పేరు చెప్పగానే ఆ గదిలో హర్షధ్వానాలు మిన్నంటాయి.

అల్లు కుటుంబం స్నేహితుల స‌మ‌క్షంలో సంబరాలు జరుపుకుంటున్నప్పుడు భావోద్వేగంతో అల్లు అర్జున్ సుకుమార్‌ను ఘాడంగా కౌగిలించుకోవడం కనిపించింది. అల్లు అర్జున్ - సుకుమార్ ఆ క్ష‌ణం ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారి కంట క‌న్నీళ్లు క‌నిపించాయి. నిజానికి ఇది వారి శ్ర‌మ‌కు, ప్ర‌తిభ‌కు స‌రియైన గుర్తింపు. భవిష్య‌త్ సంచ‌ల‌నాల‌కు ఆలంబ‌న.

ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని భావించాలి. ఇక ఈ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న వేళ పుష్ప‌రాజ్ పాత్ర‌ను క్రియేట్ చేసిన సుకుమార్ కి అల్లు అర‌వింద్ స‌హా ఇత‌రులు అభినంద‌న‌ల‌తో పాటు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ వీడియోలో మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత‌లు ఉన్నారు.

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందించ‌డ‌మే గాక‌.. పుష్ప చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా (పాటలు) దేవీశ్రీ ప్ర‌సాద్ అవార్డును గెలుచుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. పుష్ప డిసెంబర్ 2021లో విడుదలైంది. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ విజయాన్ని సాధించింది. సినిమాలోని అనేక ఐకానిక్ మూమెంట్‌లను కేవలం అభిమానులే కాకుండా నటీనటులు క్రికెటర్లు రీక్రియేట్ చేసారు. డ్యాన్సులు అనుక‌ర‌ణ‌ల‌తో అల‌రించారు.

అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 (ది రూల్) కోసం శ్ర‌మిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 2023లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని భావించినా మారిన కాన్వాసు వ‌ల్ల 2024లోనే సాధ్యం కానుంది. ఉత్తమ సినిమాటిక్ అనుభూతిని అందించడానికి బ‌న్ని-సుకుమార్ అత్యుత్త‌మ వెర్ష‌న్ ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.