బన్నీ ఫ్యాన్స్.. లైట్ తీసుకోండి
పుష్ప సినిమాలో బన్నీ పాత్రను ఉద్దేశించే పవన్ ఆ కామెంట్ చేశాడంటూ ఇప్పుడు పనిగట్టుకుని బన్నీని తప్పుబట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 8 Aug 2024 2:23 PM GMTకొన్నేళ్ల నుంచి మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య నడుస్తున్న అంతర్గత గొడవలు ఇటీవల మరింత తీవ్రం అయ్యాయి. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయడం పెద్ద దుమారానికే తెరతీసింది. దీంతో అతడి మీద మెగా అభిమానుల్లో ఒక వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వస్తోంది.
అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారితో గట్టిగానే ఢీకొడుతున్నారు. ఐతే ఇటీవల నాగబాబు.. బన్నీ గురించి పాజిటివ్ కామెంట్ చేసి మెగా అభిమానుల మధ్య గొడవలను చల్లార్చే ప్రయత్నం చేశారు.
ఇంతలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఓ కామెంట్ మళ్లీ వివాదానికి దారి తీసింది. కర్ణాటకలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన పవన్.. అక్కడ మారుతున్న సినిమాలు, హీరో పాత్రల గురించి మాట్లాడారు.
ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రల్లో కనిపించేవారని.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చేసిన గందద గుడి అందుకు ఉదాహరణ అని.. కానీ ఇప్పుడు హీరోలు అడవులను నరికే, స్మగ్లింగ్ చేసే పాత్రల్లో కనిపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించాడు. ఇది నేరుగా అల్లు అర్జున్ అభిమానులకు బలంగా తాకింది. పుష్ప సినిమాలో బన్నీ పాత్రను ఉద్దేశించే పవన్ ఆ కామెంట్ చేశాడంటూ ఇప్పుడు పనిగట్టుకుని బన్నీని తప్పుబట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.
దీని మీద మళ్లీ మెగా అభిమానుల్లో గొడవలు తప్పట్లేదు. ఐతే పవన్ కామెంట్ పుష్ప సినిమాను ఉద్దేశించే కావచ్చు కానీ.. తాను కూడా ఈ ఇండస్ట్రీలో భాగమని, ఇలాంటి పాత్రల్లో నటించడానికి ఇబ్బంది పడుతుంటానని పవన్ నవ్వుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. కాబట్టి బన్నీని మాత్రమే తప్పుబట్టి, మిగతా వాళ్లు ఉత్తములనేమీ పవన్ అనలేదు. మొత్తంగా మారిన సినిమాలు, పాత్రల తీరును పవన్ ఆక్షేపించాడు కాబట్టి బన్నీ ఫ్యాన్స్ లైట్ తీసుకోవచ్చు.