Begin typing your search above and press return to search.

నంద్యాల పర్యటనపై బన్నీ ఫుల్ క్లారిటీ

"నా అనుకున్న వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా పర్సనల్ గా నా మద్దతు కచ్చితంగా ఉంటుంది. మామయ్య పవన్‌ కళ్యాణ్ కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 May 2024 4:51 AM GMT
నంద్యాల పర్యటనపై బన్నీ ఫుల్ క్లారిటీ
X

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభకు ఓటింగ్ జరుగుతుండగా.. తెలంగాణలో కేవలం ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తెల్లవారుజామున నుంచి పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు కూడా తమ మూవీ షూటింగ్ లను పక్కన పెట్టి.. తమ వంతు బాధ్యతగా ఓటు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓటు వేశారు. సోమవారం ఉదయం ఫిలింనగర్‌ లోని బీఎస్‌ ఎన్‌ ఎల్‌ కార్యాలయంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, అన్ని పార్టీలు ఒక్కటేనని బన్నీ క్లారిటీ ఇచ్చారు.

"నా అనుకున్న వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా పర్సనల్ గా నా మద్దతు కచ్చితంగా ఉంటుంది. మామయ్య పవన్‌ కళ్యాణ్ కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో శిల్పా రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. అయితే భవిష్యత్‌ లో మా మావయ్య చంద్రశేఖర్‌ గారు, బన్నీ వాసు.. వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులు ఎవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే వారికి కూడా ఇస్తా" అని అల్లు అర్జున్ తెలిపారు.

"15 ఏళ్లుగా శిల్పా రవి నాకు ఫ్రెండ్. ఆయన రాజకీయాల్లోకి వస్తే.. సపోర్ట్ చేస్తానని, వాళ్ల ఊరు వస్తానని ఇప్పటికే మాటిచ్చా. 2019లో ఆయన పాలిటిక్స్ లో వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. ట్వీట్ చేశాను. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా వెళ్లాలని నాకు ఉంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే ఫోన్‌ చేసి మరీ వస్తానని చెప్పాను. నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లి శుభాకాంక్షలు చెప్పి వచ్చాను. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు అస్సలు లేదు" అని అల్లు అర్జున్‌ స్పష్టం చేశారు.

అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు అల్లు అర్జున్.. నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు కూడా నమోదైంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ఎక్కడ కూడా స్పందించలేదు. త్వరలోనే ఆయన పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.