జాతీయ అవార్డ్ అందుకోవడానికి దిల్లీకి బన్ని
దీనికోసం భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ దిల్లీకి బయల్దేరిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 16 Oct 2023 10:47 AM GMTభారతీయ సినిమా వందేళ్లు పైబడిన హిస్టరీలో 90ఏళ్ల చరిత్ర టాలీవుడ్ కి ఉంది. తొమ్మిది దశాబ్ధాల్లో టాలీవుడ్ ఎందరో సూపర్ స్టార్లను ఉత్పత్తి చేసింది. కానీ వీళ్లలో ఎవరూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎవరికీ గౌరవం దక్కలేదు. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ చలనచిత్రసీమ అని భావించేవారు. అసలు దక్షిణాది సినీపరిశ్రమలకు ఒక గుర్తింపు అన్నదే లేదు. పైగా ఇక్కడి స్టార్లను వారంతా చులకనగా చూసేవారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అనుభవించి ఫలవరించి మరీ ఆవేదన చెందారు.
మన లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి వారికి దిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని తెలిపారు. వారి చిత్రపటాల్ని కనీసమాత్రంగా అయినా దిల్లీ సినిమా లైబ్రరీలో ఉంచలేదని అన్నారు.
అదంతా అటుంచితే ఇప్పుడు దిల్లీ మనవైపు తిరిగి చూసేలా.. తనదైన ప్రతిభతో సత్తా చాటారు అల్లు అర్జున్. భారతీయ సినీచరిత్రలో తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా.. బన్ని ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని తెలుగు లోగిళ్లలోకి తెస్తున్నాడు. దశాబ్ధాల ఘనచరిత కలిగి ఉన్న టాలీవుడ్ కి ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును అందుకుంటున్నాడు.
రేపటి (17 అక్టోబర్ 2023) సాయంత్రం దిల్లీలో జరగనున్న జాతీయ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్ జాతీయ పురస్కార ట్రోఫీని అందుకోనున్నాడు. దీనికోసం భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ దిల్లీకి బయల్దేరిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలో పుష్పరాజ్ పాత్రకు దక్కిన అరుదైన గౌరవమిది. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నటన అనన్య సామాన్యం. అతడి నటన ఆహార్యం డైలాగ్స్ డ్యాన్సులు ఫైట్స్ ఇలా ప్రతిదీ ప్రజల్ని గొప్పగా మంత్రముగ్ధం చేసాయి.
అందుకే జూరీ అన్ని సినిమాల్ని వాటిలో నటించిన హీరోల్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ కి పట్టంగట్టింది. ఒక కమర్షియల్ సినిమాలో మాస్ హీరోగా బన్నీ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కించుకోవడం సినిమా చరిత్రలో ఒక సంచలనం అని చెప్పాలి. పుష్ప 2తో మరోసారి సంచలనం నమోదు చేయాలని బన్ని కలలుగంటున్నాడు. ఈసారి ఏకంగా 1000 కోట్ల క్లబ్ పై కన్నేశాడు.