ఒకేసారి 5-6 సినిమాలకు పని చేసినంత కష్టం: 'స్త్రీ 2' డైరెక్టర్
దెయ్యాలు - అతీంద్రియ శక్తుల కథలతో సినిమాలు తీయడం డబ్బు సంపాదించడం చాలా సులువు అనే అభిప్రాయం ఉంది. కానీ అది ఎంత కష్టమో ప్రాక్టికల్ గా చూశానని చెబుతున్నారు సంచలనాల `స్త్రీ 2` డైరెక్టర్ అమర్ కౌశిక్.
By: Tupaki Desk | 11 Dec 2024 11:30 AM GMTదెయ్యాలు - అతీంద్రియ శక్తుల కథలతో సినిమాలు తీయడం డబ్బు సంపాదించడం చాలా సులువు అనే అభిప్రాయం ఉంది. కానీ అది ఎంత కష్టమో ప్రాక్టికల్ గా చూశానని చెబుతున్నారు సంచలనాల `స్త్రీ 2` డైరెక్టర్ అమర్ కౌశిక్. హారర్ చిత్రాలను రూపొందించడంలో ముఖ్యంగా సీక్వెల్స్ పేరుతో యూనివర్శ్ రూపకల్పన చేయడం అనేది పెను సవాళ్లతో కూడుకున్నదని, ఒకేసారి ఐదారు సినిమాలకు పని చేసినంత భారం మోయాల్సి ఉంటుంది అన్నారు ఆయన. అనుభవ పూర్వకంగా తాను తెలుసుకున్న విషయాలను అతడు వివరించారు.
స్త్రీ, భేదియా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అమర్ కౌశిక్, బాలీవుడ్‌లో మడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌ను సృష్టించిన ఘనుడు. అతడి రచనా శక్తి, దర్శకత్వ ప్రతిభకు వందల కోట్లు కొల్లగొట్టే శక్తి ఉందని నిరూపణ అయింది. నిజానికి హారర్ కథలతో మడాక్ సినిమాటిక్ విశ్వం రూపొందించేప్పుడు.. ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే కథలకు అతుకులు లేని ప్రణాళిక అవసరమని అమర్ కౌశిక్ పేర్కొన్నాడు. అలా చేయడం ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేస్తున్నట్లు అనిపించిందని అన్నారు. వరుణ్ ధావన్ నటించిన భేదియాకు పని చేస్తున్నప్పుడు స్త్రీ విశ్వంలో కనెక్టింగ్ పాత్రల గురించి ఆలోచించానని అన్నారు. నిజానికి ఏదైనా స్క్రిప్ట్ రెడీ అయ్యాక సినిమాలు లేదా పాత్రలను ఇంటర్‌కనెక్ట్ చేయడానికి ప్లాన్ చేయలేదని అతడు చెప్పాడు. ఒక నిర్దిష్ట కథాంశాన్ని ఎంచుకుని అతుకులు లేని విధంగా.. అలాగే వాటిలో ప్రధాన విలన్‌ని సీక్వెల్స్ లోను కొనసాగించాలని ఏకకాలంలో తమ రచనా ప్రణాళికలో చేర్చామని తెలిపారు.
నిజానికి ముంజ్యా సినిమాలో చిన్న పిల్లాడిని నటింపజేయాలనకుని, చివరికి దానికోసం సీజీని ఆశ్రయించడానికి కారణం .. ఆ పాత్రను తర్వాతి సినిమాల్లోను కొనసాగించాలనే ఆలోచనే కారణమని తెలిపారు. సినిమాటిక్ విశ్వాన్ని రూపొందిస్తున్నప్పుడు ప్రతి చిత్రంలోను పెద్ద పరిధి గురించి ఆలోచించడం చాలా ముఖ్యం అని అమర్ విశ్లేషించారు. మనం ఒక్క సినిమా చేయడం లేదని 5 నుంచి 6 సినిమాలు తీస్తున్నామని ముందే భావించాలని అన్నారు. నిర్మాత దినేష్ విజన్ సినిమాటిక్ విశ్వాన్ని రూపొందించాలనుకుంటున్నామని తనతో చెప్పగానే ఎగ్జయిట్ అయ్యానని అమర్ కౌశిక్ వెల్లడించారు. తాను చిన్నప్పుడు నాగరాజు కామిక్స్ చదివేవాడినని, వాటిలో పాత్రలను పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానించిన తీరును చూసి ఆశ్చర్యపోయానని ఆయన వెల్లడించారు. భేదియా చేస్తున్నప్పుడు స్త్రీలోని అభిషేక్ బెనర్జీ పాత్రను భేదియాలోకి తీసుకురావాలనుకున్నామని తెలిపాడు. దానివల్ల బేధియాలో కథను రూపొందించే పరిస్థితులు మారిపోయాయని అన్నారు. తన సహాయకుల సాయంతోనే, వారి ఆలోచనలను షేర్ చేసుకోవడంతోనే ఇలాంటి సినిమాలను రూపొందించడం సాధ్యమని కూడా అన్నారు. స్ట్రీ 2 విజయం తర్వాత మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్ మరింత పెరుగుతోంది. భేధియా 2 త్వరలో చిత్రీకరణకు వెళుతుందని కూడా టాక్ వినిసిస్తోంది.