Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : అంబాజీపేట మ్యారేజిబ్యాండు

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:36 AM GMT
మూవీ రివ్యూ  : అంబాజీపేట మ్యారేజిబ్యాండు
X

అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ

నటీనటులు: సుహాస్ - శివాని నాగారం - శరణ్య - రమణ గోపరాజు - జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు

సంగీతం: శేఖర్ చంద్ర

ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్

నిర్మాత: ధీరజ్ మొగిలినేని

రచన - దర్శకత్వం: దుష్యంత్ కటికనేని

కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మల్లి (సుహాస్) అంబాజీపేటలో నాయీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతడి తండ్రి ఊర్లో సెలూన్ షాపు నడుపుతుంటాడు. మల్లి అందులో పని చేస్తూనే.. మరోవైపు మ్యారేజీ బ్యాండులోనూ సభ్యుడిగా ఉంటాడు. అతడి కవల సోదరి అయిన పద్మ (శరణ్య) ఊర్లోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె మీద వడ్డీ వ్యాపారం చేస్తూ ఊరిని పట్టి పీడిస్తున్న అగ్ర కులస్థుడు వెంకట్ (నితిన్ ప్రసన్న) కన్ను ఉంటుంది. మరోవైపు వెంకట్ చెల్లెలైన లక్ష్మి (శివాని నాగారం)తో మల్లి ప్రేమలో పడతాడు. వెంకట్ కు ఈ విషయం తెలిసి.. పద్మ పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తాడు. తనకు ఎదురొచ్చిన మల్లిని కూడా ఘోరంగా అవమానిస్తాడు. దీంతో ఊర్లో తలెత్తుకోలేని స్థితికి చేరుకుంటుంది వీరి కుటుంబం. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు మల్లి.. పద్మ ఏం చేశారు.. దాని పర్యవసానాలేంటి.. వీరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం- విశ్లేషణ:

వాస్తవ కథలను తెర మీద చూపించి డ్రామాను పండించడం కత్తి మీద సామే. నిజ జీవితాల్లో సినిమాకు కావాల్సినంత డ్రామా ఉండదు. అలా అని డ్రామా కోసం ఎక్కువ కల్పన జోడిస్తే అది నిజంగా జరిగిన కథలా అనిపించదు. ఈ కథల్లో వాస్తవికత చెడకుండానే డ్రామా సరిగ్గా పండేలా చూడడం ఓ కళ. '7/జి బృందావన కాలనీ'.. 'ప్రేమిస్తే' లాంటి ప్రేమకథలను తమిళ దర్శకులు అద్భుతంగా తెరకెక్కించి నిజ జీవిత కథలను తెరకెక్కించడంలో తమ నైపుణ్యాన్ని చూపించారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు అరుదుగానే కనిపిస్తాయి. పై చిత్రాల్లాగా కల్ట్ స్టేటస్ తెచ్చుకోలేకపోవచ్చేమో కానీ.. నిజ జీవిత కథను అందంగా.. హృద్యంగా.. హార్డ్ హిట్టింగ్ గా తెరపై చూపించిన సినిమాగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' నిలుస్తుంది. ఒక పల్లెటూరిలో ఉండే ప్రేమలు.. కుటుంబ బంధాలు.. కుల దురహంకారం.. ఈ రొటీన్ అంశాల చుట్టూనే బిగితో అల్లిన కథ.. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. వాస్తవ గాథ అని చెప్పి దానికి అడ్డదిడ్డంగా కమర్షియల్ హంగులద్దేసి కంగాళీ చేయకుండా నీట్ గా.. నిజాయితీగా ఈ కథను తెరకెక్కించిన విధానం 'అంబాజీపేట మ్యారేజీబ్యాండు'ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

సాధారణంగా సినిమాలో హీరో అంటే హీరోలాగే ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. విలన్ హీరోను అవమానించేలా ఒక మాట అంటే.. దానికి రివర్స్ పంచ్ గట్టిగా ఉండాలని ఆశిస్తారు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ.. ఇలా ఇన్ స్టంట్ రియాక్షన్ కోరుకుంటారు. కానీ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో హీరో అలా ఉండడు. విలన్ తన బార్బర్ షాపుకి వచ్చి షేవింగ్ చేయించుకుంటూ.. ఇలా గోక్కోకుండా నీకెందుకురా గొడవలు అంటే మౌనం వహిస్తాడు. ప్రేమించిన అమ్మాయి దూరమైపోతుంటే.. హీరోలా వెళ్లి ఆమెను లేపుకెళ్లే ప్రయత్నం చేయడు. ఇంకా చాలా సందర్భాల్లో నిస్సహాయుడిగానే కనిపిస్తాడు. కానీ అతడి ఆత్మాభిమానం మీద కొట్టినపుడు.. తన ఉనికే ప్రశ్నార్థకం అయినపుడు మాత్రం తన రియాక్షన్ బలంగా ఉంటుంది. నిజమైన హీరో నిద్ర లేస్తాడు. 'అంబాజీపేట..' కథ ఎక్కడ్నుంచో ఊడిపడ్డట్లు కాకుండా.. మన మధ్య జరుగుతున్న ఫీలింగ్ కలగడానికి.. ఇది నిజంగా ఓ వాస్తవ కథ అనిపించి కనెక్ట్ కావడానికి.. ఈ రియలిస్టిక్-జెన్యూన్ అప్రోచే కారణం.

ఈ సినిమాలో హీరో సోదరి తనకు జరిగిన అన్యాయానికి.. కుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఒక డైలాగ్ చెబుతుంది.. ''మేము మీ పేర్లు పలికేటపుడు వాటికి 'గారు' అని జోడించి గౌరవంతో మాట్లాడుతాం. మా పేర్ల వెనుకా ఆ 'గారు' కోసమే నా ఈ పోరాటం'' అని. చాలా బలమైన.. ఆలోచింపజేసే ఈ డైలాగులోనే 'అంబాజీపేట మ్యారేజీబ్యాండు' కథంతా ముడిపడి ఉంది. పల్లెటూళ్లలో ఉండే కుల పట్టింపులు.. దురహంకారం చుట్టూ ప్రధానంగా నడిచే కథ ఇది. ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. సుహాస్ నటించిన 'కలర్ ఫొటో' కూడా ఈ తరహా కథే. కానీ ఎక్కడా ఓవర్ డ్రమటైజ్ చేయకుండా సహజంగా అనిపించే నరేషన్.. 'అంబాజీపేట..'ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. పల్లెటూళ్లలో కులాల పరంగా అంతరం ఉన్న అమ్మాయి-అబ్బాయి చాటుమాటుగా కలుసుకుంటూ ప్రేమించుకునే సన్నివేశాలు రొటీన్ అనిపిస్తూనే ఆహ్లాదం పంచితే.. హీరో కుటుంబం పట్ల విలన్ కుల దురహంకారంతో వ్యవహరించే ఘట్టాలు హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. రెండింట్లోనూ సహజత్వం ఆయా సన్నివేశాలతో ప్రేక్షకులు ఐడెంటిఫై అయ్యేలా చేస్తుంది.

'అంబాజీపేట..' ప్రథమార్ధం చాలా వరకు సరదాగానే సాగిపోతుంది. 2007 సంవత్సరంలో కథ జరుగుతుందని చూపిస్తూ ఆ రోజుల్లోని గ్రీటింగ్ కార్డులు.. లవ్ లెటర్లు.. కాయిన్ బాక్సుల చుట్టూ తిరిగే లవ్ స్టోరీతో దర్శకుడు ప్రేక్షకులను ఆ రోజులకు తీసుకెళ్లి ఆ తరం వారికి నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించడానికి ప్రయత్నించాడు. ఎవ్వరూ చూడని.. తనను గుర్తు పట్టని చోటు అంటూ హీరో సెలూన్ షాపులో హీరోయిన్ అతణ్ని కలవడం.. దాని చట్టూ నడిచే సన్నివేశాలు కొంచెం భిన్నంగా అనిపిస్తాయి. మధ్యలో వచ్చే లవ్ సాంగ్ హుషారు పుట్టిస్తుంది. విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం చూస్తేనే.. కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. ఒక హార్డ్ హిట్టింగ్ ఎపిసోడ్ తో ప్రథమార్ధం ముగుస్తుంది. ఫస్టాఫ్ చల్తా అనిపిస్తే.. ద్వితీయార్ధం పూర్తి సీరియస్ గా సాగుతుంది. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా హీరో.. అతడి సోదరి జరిపే పోరాటం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉంటుంది. హీరో విలన్ మీద ఎదురుతిరిగి సినిమాటిగ్గా అతణ్ని మట్టికరిపించేయడం కాకుండా.. రియలిస్టిగ్గా పోరాడి పైచేయి సాధించే తీరు ప్రత్యేకంగా అనిపిస్తుంది. విలన్ కు హీరో సోదరి దీటుగా బదులిచ్చే సీన్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. ఇక్కడ మంచి హై ఇచ్చే 'అంబాజీపేట..' ఆ తర్వాత దానికి భిన్నమైన విషాదభరిత సన్నివేశాలతో డౌన్ అయినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను ఒక దశ దాటాక పూర్తిగా పక్కన పడేయడం.. ప్రేమకథకు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులకు రుచించదు. కానీ క్లైమాక్సులో మళ్లీ సినిమా పైకి లేస్తుంది. ఈ కథకు ఇచ్చిన సంప్రదాయ భిన్నమైన ముగింపు ఆకట్టుకుంటుంది. మొత్తంగా చూస్తే కులం చుట్టూ తిరిగే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కథా నేపథ్యం కొత్తది కాకపోయినా.. దాన్ని డీల్ చేసిన విధానంలో వైవిధ్యం ఉంది. రియలిస్టిగ్గా.. హార్డ్ హిట్టింగ్ గా సాగే రూరల్ డ్రామాలను మన వాళ్లూ పకడ్బందీగా తీయగలరని చాటే సినిమా ఇది. కానీ 'మసాలా' దినుసులు తక్కువైన ఈ 'బ్యాండు' కమర్షియల్ గా ఎంత సౌండ్ చేస్తుందన్నదే సందేహం.

నటీనటులు:

అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఎక్కడా పాత్రలు తప్ప నటీనటులు కనిపించరు. అందరు ఆర్టిస్టులూ అంత చక్కగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కథలు-పాత్రల ఎంపికలో అభిరుచిని చాటుతూ సుహాస్ మరోసారి తనకు తగ్గ మంచి పాత్రను ఎంచుకున్నాడు. లుక్స్ కోణంలో చూసి కొన్ని చోట్ల ఇతను హీరో ఏంటి అనిపించినా.. పాత్ర కోణంలో చూస్తే అతడితో ప్రేమలో పడిపోతాం. ఎప్పట్లాగే అమాయకత్వంతో కూడిన నటనతో అతను ఆకట్టుకున్నాడు. హీరోయిన్ చివరి కలయికలో తన హావభావాలు కట్టిపడేస్తాయి. సుహాస్ పాత్రలు ఒకే రకంగా సాగిపోతున్న విషయం మాత్రం అతను కొంచెం దృష్టిలో ఉంచుకుంటే మంచిది. హీరోయిన్ శివాని నాగారం చూడ్డానికి చక్కగా అనిపిస్తుంది. అలాగే తన హావభావాలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా అతి చేయకుండా సహజంగా నటించిందామె. ద్వితీయార్ధంలో తన పాత్ర ప్రాధాన్యం కోల్పోయినా.. ఓవరాల్ గా శివాని తన పాత్రకు న్యాయం చేసింది. విలన్ పాత్రలో చేసిన నితిన్ ప్రసన్న కూడా ఆకట్టుకున్నాడు. ఎవరీ నటుడు భలే చేస్తున్నాడే అనే ఫీలింగ్ కలుగుతుంది తనను చూస్తుంటే. ఇక సినిమాలో స్టాండౌట్ పెర్ఫామెన్స్ అంటే.. హీరో అక్క పాత్రలో చేసిన శరణ్యదే. తను ఎంత మంచి నటో ఈ సినిమాతో అందరికీ అర్థమవుతుంది. హీరోను మించి హైలైట్ అయిన పాత్రలో శరణ్య అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. తన పాత్రను ప్రేక్షకులు చాలా రోజులు గుర్తుంచుకుంటారు. పుష్ప ఫేమ్ జగదీష్ కథానాయకుడి స్నేహితుడి పాత్రలో మెప్పించాడు. గోపరాజు రమణ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరో తల్లిదండ్రులుగా కనిపించిన ఆర్టిస్టులు.. మిగతా నటీనటులు అందరూ బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

పరిమిత బడ్జెట్లో తెరకెక్కినప్పటికీ.. టెక్నికల్ గా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో సౌండ్ బాగానే కనిపిస్తుంది. శేఖర్ చంద్ర పాటల్లో 'గుమ్మా' బాగుంది. టైటిల్ సాంగ్ కూడా మంచి ఊపుతో సాగుతుంది. నేపథ్య సంగీతంతోనూ శేఖర్ మెప్పించాడు. వాజిద్ బేగ్ పల్లెటూరి అందాలను.. అక్కడి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ధీరజ్ మొగిలినేని మరోసారి తన అభిరుచిని చాటుకున్నాడు. రచయిత-దర్శకుడు దుష్యంత్ కటికనేని తొలి సినిమాతోనే తన ముద్రను చూపించాడు. కథను బిగితో చెప్పడంలో.. సన్నివేశాలను అందంగా ప్రెజెంట్ చేయడంలో దుష్యంత్ ప్రతిభ కనిపించింది. తన మాటలు కొన్ని చోట్ల బాగా పేలాయి. రియలిస్టిక్ టచ్ ఉన్న సినిమాలను బాగా తీయగలడని చాటాడు. మిగతా కథలను అతను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

చివరగా: అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. సౌండున్న సినిమానే

రేటింగ్: 3/5