అంబానీ పెళ్లి కానుకల విలువ 100కోట్లు?
రణబీర్ కపూర్ - అలియా భట్ రాధిక మర్చంట్‌కు బ్రాండ్ గూచీ నుండి వజ్రాలతో చేసిన అందమైన క్లచ్‌ను .. అనంత్ అంబానీకి ఎయిర్ జోర్డాన్ షూలను బహుమతిగా ఇచ్చారు.
By: Tupaki Desk | 12 March 2024 3:41 AM GMTఒక సామాన్యుడి పెళ్లికి గోడ గడియారాలు, దేవుళ్ల ఫోటోఫ్రేములు, ఆల్బమ్స్.. మహా అయితే తులం బంగారం కానుకగా ఇచ్చేవాళ్లు ఉంటారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో ఇంకొంచెం బెటర్ గా నవదంపతులు కొత్త కాపురానికి అవసరమయ్యే సామాగ్రిని కానుకలుగా అందిస్తుంటారు. అదే ప్రపంచంలోనే అపరకుబేరుడిగా వెలిగిపోయే ముఖేష్ అంబానీ లాంటి ప్రముఖుడి ఇంట్లో పెళ్లి జరిగితే ఆ కానుకల రేంజ్ ఎలా ఉంటుందో ఊహించగలరా?
ప్రపంచంలోని ది బెస్ట్ ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, కార్పొరెట్ దిగ్గజాలు చుట్టాలుగా పెళ్లికి అతిథులుగా వచ్చినప్పుడు ఆ కానుకల విలువను అంచనా వేయగలరా? ముఖేష్ అంబానీ- నీతా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుకలకు ప్రపంచ దిగ్గజాలు అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే. వీరి రాకతో గుజరాత్ జామ్ నగర్ జామ్ అయిపోయింది. దాదాపు 1000 కోట్ల ఖర్చుతో ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని ప్రపంచంలోనే వేరొక కుభేరుడు నిర్వహించలేనంత ఘనంగా నిర్వహించారు అంబానీ.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు ఈ వేడుకల కోసం గుజరాత్ జామ్ నగర్‌లో సమావేశమయ్యారు. అతిథుల జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, MS ధోని, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖ క్రీడా ప్రముఖులు ఉన్నారు. అద్భుత డ్యాన్స్ ఈవెంట్ లు..విందు వినోదాలు.. సరదా ఆట పాటలతో సాగిన వేడుకలో చివరకు విలాసవంతమైన బహుమతులను అందించడం ద్వారా సెలబ్స్ అంబానీ పెళ్లిని వైభవంగా సాగేలా చేసారు. ఈ ఈవెంట్ బాలీవుడ్ సామాజిక వర్గాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు క్రీడా ప్రముఖులు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఇద్దరికీ ఖరీదైన బహుమతులు ఇచ్చారు. వారి ప్రీవెడ్డింగ్ వేడుకలను అభినందించారు.
అయితే ఈ ప్రీపెళ్లికి అందిన కానుకల విలువను లెక్కగడితే సుమారు 100 కోట్లు విలువ చేస్తాయని ఒక అంచనా. రణబీర్ కపూర్ - అలియా భట్ రాధిక మర్చంట్‌కు బ్రాండ్ గూచీ నుండి వజ్రాలతో చేసిన అందమైన క్లచ్‌ను .. అనంత్ అంబానీకి ఎయిర్ జోర్డాన్ షూలను బహుమతిగా ఇచ్చారు. వీటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుందని సమాచారం.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఖరీదైన కస్టమైజ్డ్ వాచ్‌ని, రాధికా మర్చంట్‌కి ఒక జత డైమండ్ చెవిపోగులను బహుమతిగా ఇచ్చాడు. మరోవైపు షారుఖ్ ఖాన్ కాబోయే దంపతులకు రూ. 5 కోట్లకు పైగా ధర కలిగిన మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్‌ఎల్‌ఆర్‌ను బహుమతిగా ఇచ్చాడు.
సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ ఈ దంపతులకు బంగారం- డైమండ్ తో తీర్చిదిద్దిన గణేష్ - లక్ష్మి విగ్రహాలను బహుమతిగా ఇచ్చారు. కియారా అద్వానీ ఇషా అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. ఈ పెళ్లిలో కియరా అద్భుతంగా కనిపించింది. మరోవైపు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ వధువుకు డైమండ్ బ్రాస్లెట్ - నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చారు. దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌లకు కస్టమైజ్ చేసిన డైమండ్ రోలెక్స్ వాచీలను బహుకరించారు. వీటి విలువ 1 కోటి రూపాయలు.
ఇవి కొన్ని పేర్లు మాత్రమే. అతిథులుగా వచ్చిన వారిలో ప్రపంచ కుభేరులు చాలా మంది ఉన్నారు. దాదాపు 1200 మంది అతిథుల జాబితాలో గేట్స్ - జుకర్‌బర్గ్‌తో పాటు, మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, ఆమె భర్త జారెడ్ కుష్నర్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తదితర ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిల్ గేట్స్ భారతీయులకు అత్యంత ఆప్తుడు. అతడు మిలియన్ల డాలర్లను భారతదేశంలో పేదల ఆరోగ్యం కోసం విరాళాలుగా ఇచ్చారు. ఇక ఫేస్ బుక్ అధినేతకు ఇక్కడ భారీ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశం సహా ఆఫ్రికాలోని చాలామంది పేదల ఉన్నత చదువుల కోసం ఫేస్ బుక్ అధినేత విరాళాలు సామాజిక కార్యక్రమాలు అప్పట్లో చర్చకు వచ్చాయి. అలాంటి ఇరువురు దిగ్గజాలు రిలయన్స్ అంబానీల పెళ్లిలో సందడి చేయడం అభిమానులకు కన్నుల పండుగగా మారింది. వీరంతా కాబోయే దంపతులకు లక్షల డాలర్ల విలువ చేసే కానుకలు అందించి ఉంటారని గుసగుసలు వినిపించాయి.
హాలీవుడ్ సెలబ్ రిహన్నతో పాటు బి-టౌన్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, అలియా భట్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్, కియారా అద్వానీ, అనన్య పాండే, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్.ధోనీ, రోహిత్ శర్మ కూడా హాజరయ్యారు. టాలీవుడ్ స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ వేడుకలో సందడి చేసారు. ఇంతమంది దిగ్గజాలు ఒక్కొక్కరు సాధారణ కానుక అందించినా కానీ దాని విలువ చాలా పెద్దది. అతిథులందరి నుంచి అందిన కానుకల విలువ సుమారు 100 కోట్లు అంతకుమించి ఉండేందుకు ఆస్కారం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది.
రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌తో ఈ ఏడాది జూలై 12న వివాహం జరగనుంది. పెళ్లి వేడుకలకు ఇంకా ఎలాంటి ఖరీదైన కానుకలు అందనున్నాయో వేచి చూడాలి.