Begin typing your search above and press return to search.

'బ్రో' వివాదం.. వామ్మో ఢిల్లీ వరకు వెళతారా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రో వర్సెస్​ మంతి అంబటి రాంబాబు వివాదం మరింత ముదురుతోంది

By:  Tupaki Desk   |   2 Aug 2023 10:56 AM GMT
బ్రో వివాదం.. వామ్మో ఢిల్లీ వరకు వెళతారా?
X

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బ్రో' వర్సెస్​ మంతి అంబటి రాంబాబు వివాదం మరింత ముదురుతోంది. ఏపీ రాజకీయాల్లో హాట్​టాపిక్​గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడీ వివాదం దిల్లీకి కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతటా దీని గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ విషయంపై అంబటి రాంబాబు దిల్లీకి వెళ్లబోతున్నారన్న సమాచారం తెలుస్తోంది.

రీసెంట్​గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి 'బ్రో' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకుడిగా వ్యవహించారు. త్రివిక్రమ్​ స్క్రీన్​, ప్లే మాటలు అందించారు. అయితే ఈ చిత్రంలో.. సంక్రాంతి పండగలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వేసిన డాన్స్‌ను ఇమిటేట్​ చేస్తూ పేరడీగా పెట్టడం ఏపీ రాజకీయాల్లో పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాద్ధాంతం చేస్తున్నారు.

దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే ప్రెస్​ మీట్లు పెట్టి మాటల యుద్ధానికి కూడా దిగారు. పవన్​, త్రివిక్రమ్​, చిత్ర నిర్మాతలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. తాను కూడా ఓ సినిమా తీస్తానని మ్రో, తాళి-ఎగతాళి, పెళ్లి పెటాకులు, బహు భార్యల ప్రావీణ్యుడు వంటి సినిమాలు తీస్తానని అన్నారు. ఇంకా బ్రో సినిమా బడ్జెట్, పవన్ కల్యాణ్‌ రెమ్యునరేషన్, కలెక్షన్స్​.. వంటి అంశాలన్నింటిని తీసుకొచ్చి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అవన్నీ తేదేపా ముడుపులు అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పుడాయన అంతటితో ఆగలేదని తెలుస్తోంది. ఈ విషయాలపై ఆధారాలను సేకరించి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నారని బయట కథనాలు వస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసి కంప్లైంట్​ ఇవ్వబోతున్నారని ప్రచారం సాగుతోంది. మరి కాసేపట్లో దేశ రాజధాని దిల్లీకి బయలుదేరనున్నారట.

అక్కడే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో అపాయింట్‌మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీలు కూడా అక్కడ ఉన్నారు. వారితో కలిసి అంబటి.. దర్యాప్తు సంస్థల అధికారులను కలుస్తారని చెబుతున్నారు.