డేరియన్ గ్యాప్: నరకాసుర రావణాసురులను దాటుకుని అమెరికాకు!
అయితే వీళ్లలో చాలా మంది డేరియన్ గ్యాప్ అనే 75 కిలోమీటర్ల ప్రమాదకరమైన అడవి మార్గం ద్వారా అమెరికా చేరుకున్నవాళ్లే ఎక్కువ అని తెలిసాక ఆశ్చర్యపోకుండా ఉండలేం.
By: Tupaki Desk | 10 Feb 2025 3:47 PM GMTఅమెరికా నుంచి సరైన పత్రాలు లేని అక్రమ వలసదారులను పూర్తిగా వారి దేశాలకు తరిమేస్తున్న సంగతి తెలిసిందే. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మిక వేట కారణంగా, లక్షలాదిగా అక్రమ వలసదారులు తిరిగి వెనక్కి వెళుతున్నారు. అయితే వీళ్లలో చాలా మంది డేరియన్ గ్యాప్ అనే 75 కిలోమీటర్ల ప్రమాదకరమైన అడవి మార్గం ద్వారా అమెరికా చేరుకున్నవాళ్లే ఎక్కువ అని తెలిసాక ఆశ్చర్యపోకుండా ఉండలేం.
అసలు డేరియన్ గ్యాప్ అంటే ఏమిటి? అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలి? అంటే వివరాల్లోకి వెళ్లాలి. నిటారుగా ఉన్న పర్వతాలు.. బురదతో కూడిన చిత్తడి నేలలు.. వేగంగా కదిలే నదులు.. ప్రమాదకరమైన వన్యప్రాణులు.. అడవి విషపూరిత పాములు, జాగ్వర్లు.. ప్రాణాంతక కీటకాలకు నిలయం ఆ ప్రాంతం. అక్కడ నేరస్తులు, స్మగ్లర్ల గుంపులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. రేప్‌లు, మర్డర్లు అనునిత్యం కనిపిస్తాయి. మహిళ కనిపిస్తే చాలు మటాషే. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, మాదకద్రవ్యాల సిండికేట్‌లు, ఆయుధాలతో విచ్చలవిడి ప్రమాదకారులు.. ఇంతమందితో సవాళ్లను ఎదుర్కొని, చివరకు వలసదారులు అమెరికా చేరుకోవడానికి ఎన్నుకునే దారిగా చెబుతారు. దీని పేరు- డేరియన్ గ్యాప్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అననుకూల ప్రయాణ మార్గం. ఈ దారిలో వెళ్లడం ఒక సాహసం. కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగాను మార్గమధ్యంలోనే చనిపోయేవారు ఎందరో.
అయితే అమెరికా వెనక్కి పంపేసిన వారిలో చాలామంది ప్రమాదకర డేరియన్ గ్యాప్ నుంచి అమెరికాలోకి చొరబడినవారే. అమెరికాలోకి అక్రమ ప్రయాణంలో తరచుగా అనేక దేశాల గుండా ప్రమాదకరమైన క్రాసింగ్‌లు చేయాల్సి ఉంటుంది. వీటిలో అత్యంత ప్రమాదకరమైన డారియన్ గ్యాప్ - కొలంబియా, పనామాను కలిపే విస్తారమైన, రహదారి లేని అడవి. డేరియన్ గ్యాప్ అనేది 97 కిలోమీటర్ల దట్టమైన వర్షారణ్యం. చిత్తడి నేలలు, ఎత్తైన పర్వతాలు. అలాస్కా నుండి అర్జెంటీనా వరకు విస్తరించి ఉన్న రహదారి వ్యవస్థ అయిన పాన్-అమెరికన్ హైవేలో ఇది ఏకైక బ్రేక్. చిత్తడిగా ఉండే భూభాగం, కఠినమైన వాతావరణం, మౌలిక సదుపాయాల లేక అత్యంత దుర్భేధ్యమైన ప్రాంతంగా ఇది చాలా కాలంగా ప్రపంచానికి దూరంగా ఉంది. కానీ అమెరికా చేరుకోవడానికి తహతహలాడుతున్న వలసదారులకు, ఇది ఒక అనివార్యమైన ద్వారంగా మారింది.
అమెరికాలోకి వెళ్లాలని ప్రయత్నించే చాలా మంది భారతీయులు `డంకీ వే` (గాడిద మార్గం) ద్వారా ఆ దేశంలో అడుగుపెడుతుంటారు. వెళ్లే దారిలో పనామా, కోస్టా రికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ వీసాలు సులభంగా లభిస్తాయి. అక్కడి నుండి, వారు మెక్సికోకు వెళ్లి, ఆపై యుఎస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. తరచుగా ప్రమాదకరమైన క్రాసింగ్ ల సమయంలో వేల డాలర్లు వసూలు చేసే కొయోట్‌ల (మానవ స్మగ్లర్లు) సహాయం కూడా అందుతుంది.
కఠినమైన వీసా నిబంధనల కారణంగా యుఎస్‌కు ప్రత్యక్ష విమాన మార్గాలు కష్టతరం కావడంతో డంకీ వే ప్రయాణం బాగా ప్రాచుర్యం పొందింది. స్మగ్లర్లు, మాఫియా ముఠాలు, వ్యవస్థీకృత నేర సిండికేట్లు ఈ వలసదారులను తమ సంపాదనా మార్గంగా మార్చుకుని, వారికి సురక్షితమైన మార్గంలో అమెరికాకు పంపిస్తామని హామీ ఇచ్చి.. చివరకు ప్రాణాంతక పరిస్థితులలో వారిని వదిలివేస్తున్నారని సర్వేలు తేల్చి చెప్పాయి.
డారియన్ గ్యాప్ దాటేవారి సంఖ్య ఎంత?
ఇటీవల కొన్నేళ్లుగా డంకీ మార్గం ద్వారా అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
2023లో 5.2 లక్షలకు పైగా వలసదారులు ఈ ప్రయాణాన్ని చేశారు. ఇది అంతకుమునుపు సంవత్సరం కంటే రెండింతలు ఎక్కువ. 2024 నాటికి 3 లక్షలకు పైగా వరలసదారులు వచ్చారు. అయితే ఇటీవల కొన్ని కఠిన నియమాలు అమలు చేయడంతో వలసలు తగ్గాయని తెలుస్తోంది.
ఒక దశాబ్దం క్రితం, ఏటా కొన్ని వేల మంది మాత్రమే ఈ మార్గాన్ని దాటడానికి ప్రయత్నించారు. కానీ ఈరోజుల్లో లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వలస రహదారిగా మారింది. వెనిజులా, హైతీ, ఈక్వెడార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ , భారతదేశం నుండి ప్రజలు డారియన్ గ్యాప్ మార్గంలో ప్రమాదకరమైన యాత్ర చేస్తున్నారు. ఈ ప్రయాణం పూర్తవ్వడానికి 7 నుండి 15 రోజుల వరకు పట్టొచ్చు. వలసదారులు ఆహారం , నీటి కొరతతో చాలా ఇబ్బంది పడతారు. మార్గం మధ్యలో వ్యాధులు తిరగబెడతాయి. అత్యంత భయంకరమైన నేరగాళ్ల చేతిలో పడి మొత్తం డబ్బును కోల్పోతారు. ఆడాళ్లు అత్యాచారాలకు గురవుతుంటారు. అక్కడ ఎదురు తిరగడానికి ఉండదు. తలొంచుకుని వెళ్లిపోవాల్సి ఉంటుంది.
డేరియన్ గ్యాప్ ఇప్పటివరకూ ప్రమాదకర మార్గం. 2015-2022 నుండి 312 మంది వలసదారుల మరణాలు లేదా అదృశ్యాలు నమోదవ్వగా, 2021 - 2023 మధ్య 229 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. 2023లోనే 676 మంది లైంగిక వేధింపుల బాధితులకు చికిత్సలు అందించారు. 2024 ప్రారంభంలో 233 కేసులు నమోదయ్యాయి.
ఈ ప్రాంతం మానవ అక్రమ రవాణా, కార్టెల్ కార్యకలాపాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. అత్యంత శక్తివంతమైన మాదకద్రవ్యాల కార్టెల్‌లలో ఒకటైన కొలంబియా గల్ఫ్ క్లాన్ స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎప్పుడూ చర్చనీయాంశం. 2023 మొదటి 10 నెలల్లోనే వలసదారుల క్రాసింగ్‌ల ద్వారా వారు 500 కోట్లు పైగా (57 మిలియన్ డాలర్లు) సంపాదించారని కథనాలొచ్చాయి.
భారతీయులకు సంకెళ్లు వేసి...
యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇటీవల 104 మంది భారతీయ వలసదారులను చేతులకు సంకెళ్లు వేసి దాదాపు 24 గంటల పాటు ప్రయాణంలో.. విమానంలో భారతదేశానికి తరలించిన దృశ్యాలు మనం చూశాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకున్న తర్వాత ఈ బహిష్కరణ సంచలనమైంది. ఈ అంశాన్ని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ట్రంప్ ఫోన్‌లో చర్చించారు. నరకాసుర రావణాసురులను దాటుకుని అమెరికాకు వెళ్లినా ఇప్పుడు అలాంటి వారందరినీ ట్రంప్ వెనక్కి నిర్ధయగా పంపేస్తున్నాడు.