Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ ష‌ష్ఠిపూర్తి అతిథుల్లో చిరంజీవి-నాగార్జున‌?

మార్చి 13న బాంద్రాలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ తారాగ‌ణం అతిథుల స‌మ‌క్షంలో పార్టీ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 4:18 AM GMT
అమీర్ ఖాన్ ష‌ష్ఠిపూర్తి అతిథుల్లో చిరంజీవి-నాగార్జున‌?
X

మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి (60వ బ‌ర్త్ డే) వేడుక‌ల‌ను కొన్నేళ్ల కింద‌ట‌ హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్‌లో ఘ‌నంగా కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రుపుకున్నారు. ఇప్పుడు అలాంటి ఒక పార్టీని జ‌రుపుకునేందుకు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ వేడుక అత్యంత భారీగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. ఇది కేవ‌లం బ‌ర్త్ డే పార్టీ మాత్ర‌మే కాదు. ఇండ‌స్ట్రీలో త‌న ప్ర‌స్థానానికి సంబంధించిది, త‌న జీవితంలో కీల‌క వ్య‌క్తులంద‌రినీ ఓ చోట క‌లిపే వేదిక‌గా దీనిని అమీర్ ఖాన్ కుటుంబం ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం.

ఈ వేడుక‌కు బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు, త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన టాలీవుడ్ స్టార్లు కూడా అటెండ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అమీర్ ఇక్క‌డ చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, మ‌హేష్ వంటి స్టార్ల‌తో స‌న్నిహితంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌ఖ్యాత సినీనిర్మాత‌, నాయ‌కుడు, బిజినెస్ మేన్ టి.సుబ్బ‌రామిరెడ్డి ఈ వేడుక‌ల‌కు అటెండ‌య్యే అవ‌కాశం ఉంది. వారికి త‌న 60 వ బ‌ర్త్ డే ఆహ్వానాల‌ను అమీర్ ఖాన్ పంపుతార‌ని భావిస్తున్నారు.

మార్చి 13న బాంద్రాలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్‌లో భారీ తారాగ‌ణం అతిథుల స‌మ‌క్షంలో పార్టీ గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ప్ర‌ఖ్యాత మిడ్-డే క‌థ‌నం ప్రకారం.. అతిథుల‌ జాబితాలో సన్నిహితులు సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్ వంటి అగ్ర తారలు ఉన్నారు. ఇది జీవితంలో ఒక కీల‌క ఈవెంట్. ఆమిర్ ఇంత పెద్ద ఎత్తున వేడుకను నిర్వహించడం ఇదే మొదటిసారి.. అని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. బాలీవుడ్ నుంచి ఏ- లిస్ట‌ర్ల‌తో పాటు, చాలామంది టెక్నీషియ‌న్లు, ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల్లోని ప్ర‌ముఖులు ఈ వేడుక‌లకు అటెండ‌వుతార‌ని తెలుస్తోంది. అతిథుల సౌక‌ర్యం కోసం వంద‌లాది రూమ్ ల‌ను 5 స్టార్ వెన్యూలో బుక్ చేయ‌నున్నారు. అలాగే వంట‌కాలు, వ‌స‌తుల ప‌రంగా హైక్లాస్ ఏర్పాట్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. దీనికోసం ఏకంగా కొన్ని కోట్ల బ‌డ్జెట్ వ‌ర‌కూ ఖ‌ర్చు చేసే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి.

ఆమీర్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలను భారీగా ప్లాన్ చేయ‌డానికి ప్ర‌త్యేక‌ కార‌ణం లేక‌పోలేదు. ఆమీర్ వ్యక్తిగత, వృత్తిగ‌త‌ జీవితంలో ఇది కీల‌క సంవ‌త్స‌రం కావ‌డంతో గ్రాండ్ పార్టీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిసింది. అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ జనవరి 2024లో వివాహం చేసుకుంది. అతడి కుమారుడు జునైద్ తన రెండవ చిత్రం లవ్‌యాపాతో త్వరలో విడుదల కానుంది. ఈ ప్ర‌యాణం అమీర్ కి ఆనందాన్నిస్తోంది. అమీర్ ప‌రిశ్ర‌మ విష‌యంలో చాలా కృతజ్ఞతతో, సంతృప్తిగా ఉన్నాడు. అందుకే అత‌డు తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరితో తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు.. అని క్లోజ్ సోర్స్ చెబుతోంది. ఈ వేడుక కుటుంబం, స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహోద్యోగులతో క‌ళ‌క‌ళ‌లాడుతుంద‌ని చెబుతున్నారు.

అతిథుల జాబితాను మ‌రింత నిశితంగా గ‌మ‌నిస్తే.. రాజ్ కుమార్ హిరాణీ, కరణ్ జోహార్, విధు వినోద్ చోప్రా వంటి ప్ర‌ముఖులకు లిస్ట్ లో చోటుంది. హృతిక్ రోషన్, రాణి ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్, షబానా అజ్మీ వంటి నటులకు ఆహ్వానాలు అందుతాయి. దంగల్ సహనటులు సన్యా మల్హోత్రా, ఫాతిమా సనా షేక్, అలాగే ఆయన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ప్ర‌తిదీ ఘ‌నంగా ప్లాన్ చేస్తుండ‌టంతో ఈవెంట్ బ‌డ్జెట్ పైనా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అతిథులంద‌రినీ అమీర్ ఖాన్ వ్య‌క్తిగ‌తంగా క‌లిసి ఆహ్వానించ‌నున్నార‌ని కూడా తెలుస్తోంది. అమీర్ ఖాన్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరు యువ‌తితో డేటింగ్ లో ఉన్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ షష్ఠిపూర్తిలో ఇది ప్ర‌ధానంగా చ‌ర్చ‌గా మార‌నుంది.