కళ్లు భైర్లు కమ్మే లాభం చూసిన మెగాస్టార్
బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు డబుల్ అవ్వాలంటే 10 ఏళ్లు పైనే పడుతుంది. 7 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది.
By: Tupaki Desk | 21 Jan 2025 4:52 AM GMTబ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బు డబుల్ అవ్వాలంటే 10 ఏళ్లు పైనే పడుతుంది. 7 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుంది. షేర్ మార్కెట్లు గ్యారెంటీ లేనివి. డబ్బు రావొచ్చు లేదా పోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థిరాస్తి వ్యాపారం అంతకంతకు పెరుగుతోందే కానీ తరగడం లేదు. పెరిగిన జనాభాకు నగరాల్లో ఆవాసాలు పెను సమస్యగా మారాయి. అందుకే ఇది కళ్లు చెదిరే వ్యాపార మార్గం. వందల రెట్ల లాభం కళ్ల చూసే ప్రాధాన్య రంగం ఇది.
టాలీవుడ్ లో సీనియర్ నటుడు మురళీమోహన్.. అందగాడు శోభన్ బాబు సలహా పాటించి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడని చెబుతారు. అది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చినదే. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ సెన్సెక్స్ తో పాటు, రియల్ ఎస్టేట్ లోను వందల కోట్లు ఆర్జించానని స్వయంగా చెప్పాడు. అదే బాటలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం స్థిరాస్తి రంగంలో భారీ పెట్టుబడులు పెడుతోంది. దానికి తగ్గట్టు భారీ లాభాల్ని ఆర్జిస్తూ బచ్చన్ లు ఆశ్చర్యపరుస్తున్నారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓషివారాలోని తన విశాలమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను రూ.83 కోట్లకు సేల్ చేసారని స్క్వేర్ యార్డ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదైన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడించాయి. జనవరి 2025లో ఫ్లాట్ ని అమ్మినట్టు సమాచారం. ఈ విలాసవంతమైన ఆస్తి `ది అట్లాంటిస్` భవంతిలో ఉంది. క్రిస్టల్ గ్రూప్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది. ఓషివారా (ముంబై)లో సందడిగా ఉండే ప్రాంతంలో 1.55 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్ట్ ముంబై లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌కు సమీపంలో ఉంది. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన రోడ్ ల కనెక్షన్ తో ముంబై మెట్రోకు కనెక్టివిటీని కలిగి ఉండడంతో డిమాండ్ అధికంగా ఉంది.
స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ఈ డ్యూప్లెక్స్ 529.94 చదరపు మీటర్లు (5,704 చదరపు అడుగులు) విశాలమైన నిర్మాణ స్థలాన్ని కలిగి ఉంది. ఇందులో 481.75 చదరపు మీటర్లు (5,185.62 చదరపు అడుగులు) కార్పెట్ ప్రాంతంతో.. 445.93 చదరపు మీటర్లు (4,800 చదరపు అడుగులు) టెర్రస్ ను కూడా కలిగి ఉంది. ఆరు కార్లను పార్కింగ్ చేసుకునే స్థలం ఉంది. ఈ లావాదేవీకి రూ. 4.98 కోట్ల స్టాంప్ డ్యూటీ , రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారని సమాచారం.
బచ్చన్ ఈ విలాసవంతమైన నివాసాన్ని ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. ఇటీవల రూ. 83 కోట్లకు అమ్మడం నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక సంచలనం. కేవలం నాలుగేళ్లలో దాదాపు 49 కోట్ల లాభం కళ్ల జూసారు. నాలుగు సంవత్సరాలలోపు 168 శాతం లాభం అంటే ఇది ఆశ్చర్యపరిచే అమ్మకంగా భావించాలి. ఇదే ఆస్తిని నవంబర్ 2021లో యువకథానాయిక కృతి సనన్‌కు రూ. 10 లక్షల నెలవారీ అద్దెకు లీజుకు ఇచ్చారు. స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన IGR లీజు రికార్డుల ప్రకారం రూ. 60 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ ని కృతి చెల్లించింది. అమితాబ్ బచ్చన్ తన కుమారుడు అభిషేక్ తో కలిసి ముంబై శివారులోని రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని పలు ఖరీదైన ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ లలోను పెట్టుబడులు పెడుతున్నారు.