Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్ : మెగాస్టార్ దివాళా.. అప్పు తీరుస్తాన‌న్న‌ అంబానీ!

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ త‌న జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయ‌న కంపెనీలు దివాళా తీయ‌గా కుటుంబం రోడ్డున ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది

By:  Tupaki Desk   |   8 Nov 2023 12:30 AM GMT
ఫ్లాష్ బ్యాక్ : మెగాస్టార్ దివాళా.. అప్పు తీరుస్తాన‌న్న‌ అంబానీ!
X

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ త‌న జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయ‌న కంపెనీలు దివాళా తీయ‌గా కుటుంబం రోడ్డున ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. కానీ ఆయ‌న ఏదోలా కోలుకున్నారు. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి అత‌డిని ప‌త‌నం నుంచి బ‌య‌ట‌ప‌డేసింది. ఆ షో గ్రాండ్ స‌క్సెస్ సాధించ‌డంతో తిరిగి నెమ్మ‌దిగా బ‌చ్చ‌న్ జీ కెరీర్ ప‌రంగా కోలుకున్నారు. అప్పుల‌న్నీ తీర్చేసారు. స్టార్ హీరోగా ఇప్ప‌టి ఈ స్థితిని అందుకున్నారు. అయితే అంత‌కంటే ముందే అత‌డు దివాళా తీసిన స‌మ‌యంలో ఒక సంగ‌తి తెలుసుకోవాల్సిన‌ది ఉంది.

90వ దశకంలో తన కంపెనీ అప్పుల్లో ఉన్నప్పుడు, అమితాబ్ వ్యక్తిగత బ్యాంక్ బ్యాలెన్స్ సున్నాకి పడిపోయినప్పుడు ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దివంగత ధీరూభాయ్ అంబానీ రంగంలోకి దిగి తన కష్టాలన్నింటినీ ముగించే ఆఫర్ ఇచ్చార‌ని ఇప్పుడు ఇన్నాళ్ల‌కు మ‌రోసారి అమితాబ్ గుర్తు చేసుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ నాలుగు దశాబ్దాల వేడుక‌ల‌ను జరుపుకోవడానికి 2017లో జరిగిన ఒక కార్యక్రమంలో, బచ్చన్ జీ ధీరూభాయ్ అంబానీతో ఇంట‌రాక్ష‌న్‌ని గుర్తుచేసుకుంటూ ప్రసంగించారు. ఒక గొప్ప‌ వ్యాపారవేత్త తన ఉదారతను ఆ స‌మ‌యంలో ఎలా చూపించార‌నే విషయాన్ని అమితాబ్ బ‌హిర్గ‌తం చేసారు.

''నేను దివాళా తీసినప్పుడు నా జీవితంలో అది ఒక దశ. నేను నిర్మించిన కంపెనీ నష్టాలను చవిచూసింది. నాకు అప్పులు పెరిగాయి.. నా వ్యక్తిగత బ్యాంకు బ్యాలెన్స్ సున్నా. సంపాదించడానికి నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం నా ఇంటిపై దాడి చేసింది'' అని బచ్చన్ బాలీవుడ్ తెహల్కాతో ముచ్చ‌టించిన పాత వీడియోలో చెప్పారు. మెగాస్టార్ అమితాబ్ 1990లలో తన కంపెనీ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. కానీ అది టేకాఫ్ అవ్వ‌డంలో విఫలమైంది. సంస్థ దివాళా తీసింది. బచ్చన్ కుటుంబం చాలా అప్పుల్లో కూరుకుపోయింది. ఆ త‌ర్వాత‌ ధీరూభాయ్ అంబానీకి ఈ విష‌యం తెలిసింది. బ‌చ్చ‌న్ జీ పరిస్థితి గురించి ఆయ‌న‌ తెలుసుకున్నాడు. తన చిన్న కుమారుడు అనిల్ అంబానీని అమితాబ్ వ‌ద్ద‌కు పంపారు. అనీల్‌తో ధీరూభాయ్ ''ఇస్కా బురా వక్త్ హై.. ఇసే కుచ్ పైసే దే దో'' అని చెప్పిన విధానాన్ని అమితాబ్ గుర్తుచేసుకున్నాడు.

అనిల్ తన వద్దకు వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు తాను అత‌డిని హత్తుకున్నానని అమితాబ్ చెప్పాడు. ''అతడు ఏది ఆఫర్ చేసినా, నా ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయేవి. నేను అతడి దాతృత్వానికి ఉద్వేగానికి లోనయ్యాను కాని దానిని తిరస్కరించాను. దేవుడు దయగలవాడు .. కొన్ని కఠినమైన రోజుల తర్వాత, ఆటుపోట్లు మారిపోయాయి. నేను పని చేయడం ప్రారంభించాను. నెమ్మదిగా నా అప్పులన్నీ తీర్చుకోగలిగాను'' అని బ‌చ్చ‌న్ జీ తెలిపారు.

ఒక ప్రత్యేక సందర్భంలో తనను ధీరూభాయ్ అంబానీ నివాసానికి ఆహ్వానించారని బచ్చన్ చెప్పారు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు ధీరూభాయ్ అంబానీ వ్యాపార ప్రపంచంలోని పెద్ద పేరున్న వారితో మాట్లాడటంలో బిజీగా ఉండటం అమితాబ్ చూశాడు. ''అతను నన్ను చూడగానే పిలిచి తనతో కూర్చోమని అడిగాడు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను అక్కడ నా స్నేహితులతో హాయిగా ఉన్నానని చెప్పాను కానీ.. అతడు పట్టుబట్టి నన్ను కూర్చోబెట్టాడు. అప్పుడు అంద‌రు ప్రముఖుల ముందు అతడు ఇలా అన్నారు.

''ఈ బాలుడు పడిపోయాడు.. కానీ అతడు తన సొంత కాళ్ల‌పై నిల‌బ‌డి తిరిగి వచ్చాడు.. నేను అతడిని గౌరవిస్తాను..'' అని అంబానీ వ్యాఖ్యానించారు. నాటి సంక్షోభం నుండి బయటపడటానికి అంబానీ నాకు సహాయం చేసిన మొత్తం కంటే, అతడి మాటలు దాతృత్వం చాలా విలువైనవి. ఇది ఆయ‌న రోల్‌.. అని అన్నారాయన.