మెగా తండ్రి కొడుకులు 75కోట్ల పెట్టుబడులు!
ఇదే కాదు.. బచ్చన్ సాబ్ ఈ ఏడాది పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 27 Jun 2024 5:07 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సైరా తర్వాత ఇప్పుడు కల్కి 2898 లాంటి భారీ క్రేజీ మూవీలో నటించారు. ఈ సినిమాలో బచ్చన్ జీ అశ్వత్థామగా కీలక పాత్రలో నటించారు. తన పాత్ర కోసం ఆయన భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నారన్న సమాచారం ఉంది. ఇదే కాదు.. బచ్చన్ సాబ్ ఈ ఏడాది పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తద్వారా ఆయన భారీ మొత్తాలను ఆర్జిస్తున్నారు.
అయితే ఈ మొత్తం డబ్బును ఏ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు? అంటే .. కచ్ఛితంగా ఆయన యాక్టివిటీని గమనించిన వారు రియల్ ఎస్టేట్ అని కుండబద్ధలు కొడుతున్నారు. తాజాగా అమితాబ్ బచ్చన్ ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో దాదాపు రూ.60 కోట్ల విలువైన మూడు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారని తెలిసింది. ఫ్లార్ టాప్ డాట్ కాం యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ వివరాల్ని చూపించినట్టు లైవ్ మింట్ కథనం పేర్కొంది. అంధేరిలోని వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో ఉన్న ఈ యూనిట్లు 2701, 2801 మరియు 2901 నంబర్‌లతో ఉన్నాయి. 20 జూన్ 2024న రిజిస్టర్ అయిన పత్రాల ప్రకారం... ఈ లావాదేవీ ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని వీర దేశాయ్ రోడ్‌లోని సిగ్నేచర్ బిల్డింగ్‌లో మూడు కార్యాలయ యూనిట్ల కోసం జరిగింది. వీటి కోసం మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఓవైపు స్మాల్ బి అభిషేక్ బచ్చన్ రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతుండగా బిగ్ బి పెట్టుబడులు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి.
కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి బిగ్ బి ప్రవేశించడం ఇది మొదటిది కాదు. అతడు గత సంవత్సరం ఇదే భవనంలో దాదాపు రూ.29 కోట్లతో మొత్తం 8,396 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు యూనిట్లను కొనుగోలు చేశాడు. 1సెప్టెంబర్ 2023న రిజిస్టర్ చేసిన ఈ కొనుగోలుకు రూ.1.72 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు అమితాబ్. బచ్చన్ అపార్ట్ మెంట్లు ఉన్న కమర్షియల్ టవర్‌లో యూనిట్లను కలిగి ఉన్న ఇతర బాలీవుడ్ తారలలో అజయ్ దేవగన్, సారా అలీ ఖాన్ ఆమె తల్లి అమృతా సింగ్, కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయి ఉన్నారు.
ఇటీవలి సమాచారం మేరకు.. అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ ముంబైలో రూ.15 కోట్లకు పైగా వెచ్చించి ఆరు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. అభిషేక్ బచ్చన్ బోరివాలిలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ ద్వారా ఒబెరాయ్ స్కై సిటీ ప్రాజెక్ట్‌లో ఆరు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. జాప్‌కీ డాట్ కాం నుండి ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ వివరాలను వెల్లడించగా..స్మాల్ బి తన సాముపార్జనలో రూ.15.42 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ లావాదేవీ 28 మే 2024న జరిగింది.
బచ్చన్ కుటుంబానికి ముంబైలో అనేక ఆస్తులు ఉన్నాయి. గత సంవత్సరం అమితాబ్ బచ్చన్ ఆయన భార్య జయ బచ్చన్, ముంబైలోని ఖరీదైన జుహూ ప్రాంతంలో తమ విలాసవంతమైన బంగ్లా, ప్రతీక్షను వారి కుమార్తె శ్వేతా నందకు బహుమతిగా ఇచ్చారు. 1జూలై 2023న అమితాబ్ బచ్చన్ ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని వాణిజ్య సముదాయంలోని 21వ అంతస్తులో ఒక్కొక్కటి రూ.7.18 కోట్లకు నాలుగు యూనిట్లను కొనుగోలు చేశారు. ప్రతి యూనిట్‌లో మూడు కార్ పార్కింగ్ స్లాట్‌లు ఉన్నాయి. ఈ లావాదేవీలో రూ.43.10 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు కూడా ఉంది. అమితాబ్ ముంబైలోని అట్లాంటిస్ ప్రాజెక్ట్‌లో రూ.31 కోట్ల విలువైన 5,184 చదరపు అడుగుల ఆస్తిని సంపాదించారు. దీనిని టైర్-2 బిల్డర్ అయిన క్రిస్టల్ గ్రూప్ అభివృద్ధి చేసింది. అమితాబ్ డిసెంబర్ 2020లో ఆస్తిని కొనుగోలు చేసినప్పటికీ అది అధికారికంగా ఏప్రిల్ 2021లో నమోదు అయింది.
బిగ్ బి నటించిన కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే అమెరికా నుంచి అద్భుత సమీక్షలు వచ్చాయి. అమితాబ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. బిగ్ బి, ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు నటించిన కల్కి 2898 AD చిత్రంపై పాజిటివ్ సమీక్షలు రావడం ఆసక్తిని కలిగిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించింది.