‘కల్కి’.. అమితాబ్‌తో నాగి ఏం ప్లాన్ చేస్తున్నాడబ్బా?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్.. తన బ్లాగ్‌లో ‘కల్కి 2898 ఏడీ’ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.
By: Tupaki Desk | 30 July 2024 7:50 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ''కల్కి 2898 AD''. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బద్దలు కొడుతోంది. విడుదలైన నెల రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల మార్కును క్రాస్ చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇందులో బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న బిగ్ బీ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బచ్చన్.. తన బ్లాగ్‌లో ‘కల్కి 2898 ఏడీ’ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. "మేము 'కల్కి' చిత్రాన్ని కొన్నింటికి పరిమితం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. నేను దాని కోసం పని చేస్తున్నాను. అయితే దయచేసి ఈ పోస్ట్‌ను ఆహ్వానంగా భావించ వద్దు. ఇది ఇంకా ప్రణాళిక దశలోనే ఉంది. ఇది ఫలించొచ్చు, విఫలమవ్వచ్చు. అప్పటి వరకు లవ్ యూ ఆల్'' అని అమితాబ్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా నాగి ఏదో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారేమో అని అందరూ అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగానే అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'కల్కి 2898 AD' సెట్స్ నుండి ఒక ఫోటోను షేర్ చేసారు. "అర్ర్… కల్కీ పనిలో ఉన్నాను. ఇప్పుడే ఇలా వేళాడుతున్నాను" అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇందులో బిగ్‌బీ రోప్స్ సహాయంతో గాల్లో నిలబడి ఉన్నారు. 80 ఏళ్ల వయసులో అమితాబ్ ఇలాంటి స్టంట్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యంగ్ హీరోలే డూప్ ని పెట్టుకొని యాక్షన్ సీన్స్ చేస్తున్న రోజుల్లో.. ఇలాంటి రిస్కీ ఫీట్స్ చేస్తున్నాడంటే సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. 'ఇప్పటికీ పని కోసం పరిగెడుతున్నా' అంటూ సీనియర్ నటుడు రీసెంట్ గా ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.
పురాణాలు ఇతిహాసాలతో సైన్స్ ను ముడిపెడుతూ సరికొత్త కథాంశంతో 'కల్కి 2898 AD' సినిమాని తెరకెక్కించారు. ఈ ఫిక్షన్ డిస్టోపియన్ ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ మూవీ బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన యాక్షన్, ఆలోచింపజేసే బ్యాక్ డ్రాప్, ప్రధాన నటీనటుల పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే భాషతో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా ఆదరణ లభిస్తోంది.
'కల్కి' మూవీలో బౌంటీ హంటర్ గా, కర్ణుడిగా రెండు పాత్రల్లో కనిపించారు ప్రభాస్. విష్ణువు యొక్క 10వ అవతారాన్ని మోసే సుమతి అనే గర్భిణీ స్త్రీగా దీపికా పదుకునే నటించగా.. ఆమెకు పుట్టబోయే బిడ్డను రక్షించే అమరుడైన అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు. ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ కనిపించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్ లాంటి పలువురు అతిథి పాత్రల్లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. పార్ట్-2 కోసం సినీ అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు.