Begin typing your search above and press return to search.

'హరిహరవీరమల్లు'పై నిర్మాత క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత లైన్లో పెట్టిన సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.

By:  Tupaki Desk   |   4 Sept 2023 3:57 PM IST
హరిహరవీరమల్లుపై నిర్మాత క్లారిటీ
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత లైన్లో పెట్టిన సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ చిత్రం మొదలై మూడేళ్లు కావస్తోంది. కానీ దీని తర్వాత మొదలైన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ సినిమాలు రిలీజైపోయాయి. ‘ఓజీ’ సినిమా పూర్తి కావస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సైతం సగం దాకా షూటింగ్ జరుపుకుంది. కానీ ‘హరిహర వీరమల్లు’ సంగతే ఎటూ తేలకుండా ఉంది. ఈ సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటో.. రిలీజ్ ఎప్పుడుంటుందో అస్సలు సమాచారం లేదు. ఇటీవల పవన్ పుట్టిన రోజుకు ఒక పోస్టర్ రిలీజ్ చేయడంతో మళ్లీ ఆ సినిమా గురించి కొంత చర్చ జరిగింది. మరి సినిమా పరిస్థితి ఏంటో మేకర్స్ నుంచి తెలుసుకోవాలని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘రూల్స్ రంజన్’కు సంబంధించిన ఒక ప్రెస్ మీట్లో ఎ.ఎం.రత్నం ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘రూల్స్ రంజన్’ ప్రెస్ మీట్లో ముందు ఈ సినిమా గురించే మాట్లాడి.. మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా స్టేజ్ దిగి వెళ్లి పోయిన రత్నం.. ఆ తర్వాత వెనక్కి రావడం విశేషం. అలా వచ్చాక ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటని అడగ్గా.. ‘‘ఆ సినిమా పీరియడ్ ఫిలిం. చాలా పెద్ద సినిమా. మీకు తెలుసు. కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఒకేసారి ఆయన అన్ని డేట్లు ఇచ్చినా సినిమా చేయలేం. అన్ని సెట్లు వేయాలి. మామూలుగా రెగ్యులర్‌గా తీసే సినిమా కాదు. గ్రాఫిక్ వర్క్ చాలా చేయాలి. చాలా పని ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. ఆయనే చెప్పారు.. నేను సినిమాలకు పని చేయాలి. ఆ డబ్బులు తీసుకెళ్లి రాజకీయాలకు ఖర్చు పెట్టాలి అని. అందుకే కొన్ని రీమేక్స్, తక్కువ రోజుల్లో అయిపోయే సినిమాలు ఆయన సమాంతరంగా చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోపు మా సినిమాను పూర్తి చేస్తాం. ఎన్నికలకంటే ముందే రిలీజ్ కూడా చేస్తాం’’ అని రత్నం ధీమా వ్యక్తం చేశారు.