Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్ లో 28శాతం వ‌సూలు చేసిన‌ ఏకైక‌ విల‌న్?

భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌లలో దివంగ‌త‌ అమ్రీష్ పూరి ఒకరు

By:  Tupaki Desk   |   24 Jun 2024 5:30 PM GMT
బ‌డ్జెట్ లో 28శాతం వ‌సూలు చేసిన‌ ఏకైక‌ విల‌న్?
X

భారతీయ సినీప‌రిశ్ర‌మ‌లో అత్యధిక పారితోషికం తీసుకునే విలన్‌లలో దివంగ‌త‌ అమ్రీష్ పూరి ఒకరు. అత‌డు తెర‌పై క‌నిపిస్తే చాలు.. ఆ గంభీర‌మైన టోన్ (కంఠం) ఎల్లప్పుడూ అద్భుతాలు చేసింది. అత‌డి రూపురేఖ‌లు కూడా దీనికి అద‌న‌పు బ‌లంగా మారాయి. బోనీకపూర్‌ నిర్మించిన హమ్‌ పాంచ్‌లో తొలిసారిగా అత‌డు విలన్‌గా నటించారు. అందులో న‌టించినందుకు రూ. 40,000 చెల్లించామ‌ని నిర్మాత‌ ధృవీకరించారు. అయితే అతడి నటన చాలా బాగుంది గ‌నుక‌ అదనంగా మ‌రో రూ.10,000 చెల్లించాం. ఇది విలన్‌గా మొదటి నటనకు అమ్రిష్ పురి పారితోషికం రూ. 50,000 అని బోనీ తెలిపారు.

అయితే `మొగాంబో ఖుష్ హువా ..` అనే ఒక డైలాగ్ తన జీవితాన్నంతటినీ మార్చేసిందని అమ్రిష్ పూరి అప్ప‌ట్లో తెలిపారు. ఆయ‌న విలన్‌గా చిరస్థాయిగా నిల‌వ‌డానికి అత‌డి కంఠం ప్ర‌ధాన అస్సెట్ అయింది. బోనీ కపూర్ టీమ్ అంతా వ్య‌తిరేకించినా కానీ.. అమ్రిష్ ని మొగాంబోగా బోనీ ఎంచుకున్నాడు. అటుపై అమ్రిష్ పూరి గుండు తల (బాల్డ్ హెడ్) విలన్‌కి ఐకానిక్ రిఫరెన్స్‌గా మారింది. ఆ త‌ర్వాత అతడి కెరీర్ గురించి తెలిసిన చ‌రిత్రే. హిందీ-తెలుగు-త‌మిళ చిత్రాల్లో అత‌డు విల‌న్ గా ఓ వెలుగు వెలిగాడు.

ఒక ఇంటర్వ్యూలో తనకు 1 కోటి పారితోషికం ఇస్తున్నట్లు అమ్రిష్ పురి అంగీకరించాడు. కోటి ఇవ్వ‌నందుకు ఒక చిత్రం నుండి తప్పుకున్నట్లు కూడా ఆయ‌న తెలిపాడు. తన మార్కెట్ గురించి సుదీర్ఘంగా మాట్లాడిన డేరింగ్ విల‌న్ అత‌డు ఆరోజుల్లో. ``నేను నా బాకీని పొందాలి. నా నటన విషయంలో రాజీ పడను కదా? కాబట్టి నేను ఎందుకు తక్కువ అంగీకరించాలి? నా నటన చూసేందుకు జనాలు వస్తుంటారు. నేను సినిమాలో ఉన్నాను కాబట్టి నిర్మాత తన డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు నా నిర్మాతల నుంచి వసూలు చేయడంలో తప్పేముంది?`` అని అమ్రిష్ పురి వ్యాఖ్యానించిన సంద‌ర్భాలున్నాయి.

అమ్రిష్ పూరి మిస్టర్ ఇండియా కోసం కూడా కోటి మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం. ఆ సినిమాకి శ్రీదేవి 11 లక్షల ఫీజు తీసుకోగా.. అమ్రిష్ పురి పారితోషికం దానికంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ తీసుకున్నాడు. ఆ సమయంలో ఇది అతడి మార్కెట్ ధర అని ఎవరూ చెప్ప‌లేరు కానీ.. మిస్టర్ ఇండియా 3.5 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కినందున అత‌డి పారితోషికం గురించి చాలా చ‌ర్చ సాగింది. 1 కోటి వసూలు చేసే విలన్ సినిమా మొత్తం బడ్జెట్‌లో 28 శాతం లాగేసుకున్నాడ‌న్న ప్ర‌చారం సాగింది. పారితోషికం విష‌యంలో రాజీ అన్న‌దే లేకుండా నిర్మాత‌ల ముక్కు పిండిన న‌టుడిగా అమ్రిష్ పురికి పేరుంది.

`దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే`లో సిమ్రాన్ (కాజోల్‌) తండ్రిగా నటించినప్పుడు అమ్రిష్ పూరి గేర్ మార్చారు. తెరపై అత్యంత పాపుల‌ర్ తండ్రిగా పేరు తెచ్చుకున్నారు. అత‌డు తొమ్మిది సార్లు ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికయ్యాడు.