నటి పరిస్థితి ఇంకా విషమంగానే..!
ఆమె తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
By: Tupaki Desk | 4 April 2024 6:07 AM GMTతమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన అరుంధతీ నాయర్ కేరళలో ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అరుంధతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిసింది. ఆమె సోదరి ఆరతి ఈ వార్తను ధృవీకరించారు. కోవలం బైపాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అరుంధతి తలకు, మెడకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. తలలో రక్తం గడ్డ కట్టడంతో బ్రెయిన్ సర్జరీ చేసారు. పక్కటెముకలు విరగడంతో వాటికి శస్త్ర చికిత్స చేయించాల్సి ఉండగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఆమె తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడి త్రివేండ్రంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచగా ప్రాణాల కోసం పోరాడుతోంది అని అరుంధతి సోదరి ఆరతి తెలిపారు. అరుంధతీ తన సోదరుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నా తమిళ పరిశ్రమ నుంచి ఎవరూ తనకు ఆర్థిక సాయం అందించలేదని కుటుంబీకులు పేర్కొన్నారు. రోజుకు 2లక్షలు చొప్పున ఇప్పటికే 40లక్షలు ఖర్చు చేసామని అయినా పరిస్థితి మెరుగవ్వలేదని వెల్లడించారు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న తమ సోదరి కోసం ప్రార్థించాలని ఆ కుటుంబీకులు కోరారు.
అరుంధతి నాయర్ 2014లో తమిళ చిత్రం `పొంగి ఎజు మనోహర`తో అరంగేట్రం చేసింది. విజయ్ ఆంటోని సైతాన్‌లో నటించిన తర్వాత ఆమె ఇంటి పేరుగా మారింది. 2018లో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ కోసం ప్రయత్నించింది. అటుపై `ఒట్టకోరు కాముకాన్`లో కనిపించింది. 2023లో తన చివరి చిత్రం విడుదలైంది. విధార్థ్‌తో కలిసి ఆయిరం పోర్కాసుకల్‌లో నటించింది. ఈ చిత్రానికి రవి మురుకాయ దర్శకత్వం వహించారు.