Begin typing your search above and press return to search.

నాగ్ అశ్విన్ ధైర్యానికి గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పేరు ప్ర‌జ‌ల్లో ఇప్పుడు మునుప‌టి కంటే ఎక్కువ‌గా మార్మోగుతోంది.

By:  Tupaki Desk   |   24 May 2024 3:45 AM GMT
నాగ్ అశ్విన్ ధైర్యానికి గర్వంగా ఉంది: ఆనంద్ మహీంద్రా
X

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పేరు ప్ర‌జ‌ల్లో ఇప్పుడు మునుప‌టి కంటే ఎక్కువ‌గా మార్మోగుతోంది. దానికి కార‌ణం సినీరంగంతో, సినీసెల‌బ్రిటీల‌తో ఆయ‌నకు ఉన్న గొప్ప‌ అనుబంధం. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్, నాగ్ అశ్విన్ స‌హా సినీ ప్ర‌ముఖుల‌తో ఆయ‌న‌కు స‌త్సంబంధాలున్నాయి. వారితో ఆయ‌న సోష‌ల్ మీడియాల‌లో ఇంట‌రాక్ట్ అవుతున్నారు.

ఇప్పుడు `క‌ల్కి` చిత్ర‌బృందానికి అవ‌స‌ర‌మైన సూప‌ర్ కార్ రూప‌క‌ల్ప‌న కోసం ఆనంద్ మ‌హీంద్రా చేసిన స‌హాయం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిన్న‌నే `బుజ్జి- ది రోబోట్` సూప‌ర్ కార్ లుక్ ని లాంచ్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో `కల్కి 2898 ఏడీ`కి చెందిన హైటెక్ రోబో కారు బుజ్జిని ఆవిష్కరించారు. ఇదే వేదిక‌పై ఈ రోబోట్ కార్ ని రూపొందించిన ప్ర‌ముఖుల‌ను కూడా ప‌రిచ‌యం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

X (గతంలో ట్విట్టర్)లో ఆనంద్ మహీంద్రా తన బృందం .. . మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన చెన్నై బృందం `కల్కి` టీమ్‌కు వారి `ఫ్యూచరిస్టిక్ వెహికల్ కోసం విజన్ - బుజ్జి`ని నెరవేర్చడానికి సహాయం చేసింది. కోయంబత్తూర్‌కు చెందిన జయమ్ మోటార్స్ రోబోట్ కారు డిజైన్‌ను రూపొందించి, తయారు చేసినట్లు కూడా వెల్ల‌డించారు. ఇది వెనుక గోళాకార చక్రానికి శక్తినిచ్చే రెండు మహీంద్రా ఇ-మోటార్‌లతో నడుస్తుంది.. అని తెలిపారు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా బృందం పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్ .. అలాగే కార్ పనితీరును అనుకరించడం ద్వారా ఫ్యూచరిస్టిక్ వాహనం కోసం ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపంతో డిజైన్ చేసేందుకు కల్కి బృందానికి సహాయం చేసిందని వెల్ల‌డించారు.

కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ని మ‌హీంద్రా ప్రశంసించారు. మేమంతా నాగ్ అశ్విన్ గురించి చాలా గ‌ర్వంగా ఉన్నాం. అత‌డు పెద్ద‌గా ఏదో చేయాల‌ని.. పెద్దగా ఆలోచించడానికి భయపడని ఫిలింమేక‌ర్ .. ద‌ర్శ‌కుల తెగ‌ గ‌ర్వించ‌ద‌గిన ద‌ర్శ‌కుడు అని ప్ర‌శంసించారు. మహీంద్రా ట్వీట్‌కు అశ్విన్ స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చాడు.``ధన్యవాదాలు సార్... అసాధ్యమైన వాటిని కలలు కనడంలో మాకు సహాయం చేసినందుకు అలాగే మా బుజ్జికి రెక్కలు (టైర్లు..) ఇచ్చినందుకు`` అని పోయెటిక్ గా స్పందించాడు.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ `కల్కి 2898 ఎడి` మేకింగ్ ప‌రంగా చాలా కష్టతరమైన చిత్రం. నాకు ఇంజినీరింగ్ నేపథ్యం లేదు. నేను సహాయం కోసం ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేసాను .. ఒక బృందాన్ని సమీకరించాను. కోయంబత్తూర్‌లోని రేస్ కార్లను తయారు చేసే జయం మోటార్స్‌తో సన్నిహితంగా ఉండటానికి వారు మాకు సహాయం చేసారు``అని చెప్పాడు. ప్రత్యేక ఫీచర్లతో కూడిన కారును డిజైన్ చేయడం, నిర్మించడంపై చాలా పరిశోధనలు జరుగుతాయని కూడా నాగ్ అశ్విన్ తెలిపారు. బుజ్జి తో పాటు సూప‌ర్ కార్ భారీగా ఉంది. భైరవ కోసం దీనిని దశలవారీగా నిర్మించాము అని అన్నారు.

ఇది రోబో చిత్రం త‌ర‌హాలోనే ప్ర‌యోగాత్మ‌క సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం. కల్కిలో భైరవ నమ్మకమైన భాగస్వామిగా బుజ్జి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. రోబోట్ కారు భైరవ తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే మేధావిగా చూపిస్తున్నారు. బుజ్జి కామిక్ టైమింగ్ ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ఈ పాత్ర‌కు కీర్తి సురేష్ వాయిస్ ని అందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ కాకుండా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు.