Begin typing your search above and press return to search.

బుజ్జితో ఆనంద్ మహీంద్రా.. వీడియో చూశారా?

ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ స్పెషల్ వాహనాన్ని నడిపారు.

By:  Tupaki Desk   |   12 Jun 2024 11:47 AM GMT
బుజ్జితో ఆనంద్ మహీంద్రా.. వీడియో చూశారా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో కల్కి 2898 ఏడీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు కనిపించనున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ మూవీ కోసం మేకర్స్ ప్రత్యేక వాహనం బుజ్జిని రూపొందించిన విషయం తెలిసిందే. సినిమాలో కీలకమైన ఈ బుజ్జిని మేకర్స్ కొన్ని రోజుల క్రితం.. రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా రివీల్ చేశారు. ప్రభాస్ నేరుగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సందడి చేశారు.

ఇప్పుడు బుజ్జి.. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ స్పెషల్ వాహనాన్ని నడిపారు. అందుకు సంబంధించిన వీడియోను కల్కి మేకర్స్.. బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అని క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుజ్జితో డ్రైవ్ అనంతరం ఫోటోలు కూడా దిగారు ఆనంద్ మహీంద్రా.

ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా డ్రైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వెహికల్ తయారీలో మహీంద్రా కంపెనీ భాగమైన విషయం తెలిసిందే. కల్కి సినిమా మొదలైనప్పుడు ఆనంద్ ను ట్యాగ్ చేసి.. స్పెషల్ వెహికల్ తయారీకి సహాయం కావాలని నాగ్ అశ్విన్ అడిగారు. దీంతో చెన్నైలోని తమ వెహికల్స్ తయారు చేసే టీమ్ కు చెప్పి నాగ్ అశ్విన్ వర్క్ అయ్యేలా చూశారు ఆనంద్ మహీంద్రా. బుజ్జి లాంచింగ్ ఈవెంట్ లో కూడా మహీంద్రా ఉద్యోగుల వల్ల వెహికల్ సాధ్యమైందని చెప్పారు నాగి.

బుజ్జి రివీల్ చేసిన తర్వాత కూడా ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన రావడం అద్భుతమని కొనియాడారు. కల్కి మేకర్స్ కు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌ హెల్ప్ చేసిందని తెలిపారు. బుజ్జి రెండు మహీంద్రా ఈ-మోటార్లతో నడుస్తుందని చెప్పారు. జయం ఆటోమోటివ్స్ కూడా వెహికల్ తయారుచేయడంలో భాగమైందని వెల్లడించారు. మొత్తంగా ఈ వెహికల్ తయారీకి రూ.7 కోట్ల ఖర్చు అయినట్లు సమాచారం.