పవన్ కోసం రాసిన కథ.. చిరుకి పోటీగా..!
ఆనంద్ కథ మొత్తం ను కూడా పవన్ ను దృష్టిలో ఉంచుకునే శేఖర్ కమ్ముల రాసినా కూడా.. చివరకు ఆ కథ ను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్లలేదు.
By: Tupaki Desk | 12 March 2024 8:30 AM GMTపవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కాదన్న ఎన్నో కథలు ఇతర హీరోలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అనేక కారణాల వల్ల పవన్ నో చెప్పిన కథల్లో కొన్ని ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయి. అయితే పవన్ కోసం రాసుకున్న ఒక కథ కనీసం పవన్ వద్దకు వెళ్లకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ విషయంలోకి వెళ్తే.. డాలర్ డ్రీమ్స్ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాని కాస్త కమర్షియల్ టచ్ తో రూపొందించాలని అనుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ ని దృష్టిలో ఉంచుకుని కథ ను రాయడం మొదలు పెట్టిన శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీ 'ఆనంద్' కథ ను రెడీ చేశాడు.
ఆనంద్ కథ మొత్తం ను కూడా పవన్ ను దృష్టిలో ఉంచుకునే శేఖర్ కమ్ముల రాసినా కూడా.. చివరకు ఆ కథ ను పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకు వెళ్లలేదు. అందుకు ప్రయత్నించాడా లేదా అనేది తెలియదు కానీ ఆనంద్ సినిమాను పవన్ తో కాకుండా రాజా తో రూపొందించిన విషయం తెల్సిందే.
రాజా అప్పటికే రెండు మూడు సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు. అందుకే రాజా తో ఆనంద్ సినిమాను తీయాలని భావించి హీరోయిన్స్ గా పలువురి పేర్లు పరిశీలించి చివరకు కమలిని ముఖర్జీ ని ఎంపిక చేసినట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.
చిన్న సినిమాగా రూపొందిన ఆనంద్ సినిమా పెద్ద సినిమా అయిన మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ కి పోటీగా విడుదల చేయాల్సి వచ్చింది. చిరు మూవీ విడుదల అయిన రోజే ఆనంద్ సినిమాను విడుదల చేయాల్సి వచ్చినా కూడా శేఖర్ కమ్ముల వెనకాడకుండా రిలీజ్ చేశాడు.
శంకర్ దాదా ఎంబీబీఎస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే రోజు వచ్చిన ఆనంద్ సినిమా మెల్ల మెల్లగా ప్రేక్షకులకు ఎక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శంకర్ దాదా సినిమా ఓపెనింగ్స్ జోరు తగ్గిన తర్వాత ఆనంద్ సినిమా వసూళ్ల సందడి షురూ అయ్యింది.