Begin typing your search above and press return to search.

అనంత శ్రీరామ్ పాత పురాణాలు బయటకు తీస్తున్న నెటిజన్లు..!

ఒక దర్శకుడు పాటలో 'బ్రహ్మాండ నాయకుడు' అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదని అనంత శ్రీరామ్ తెలిపారు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 2:25 PM GMT
అనంత శ్రీరామ్ పాత పురాణాలు బయటకు తీస్తున్న నెటిజన్లు..!
X

ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల హైందవ శంఖారావం సభలో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత సాహిత్య వాంజ్ఞయానికి రెండు కళ్లైన వాల్మీకి రామాయణం, వ్యాస భారతాలను వినోదం కోసం వక్రీకరిస్తున్నారని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత, రామాయణ, భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్టు మార్చేశారన్నారు. 'కల్కి' సినిమాను ఉద్దేశిస్తూ నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతారు? అని ప్రశ్నించారు.

ఒక దర్శకుడు పాటలో 'బ్రహ్మాండ నాయకుడు' అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదని అనంత శ్రీరామ్ తెలిపారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని, అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. లిరిసిస్ట్ స్పీచ్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సినిమాల్లో స‌నాత‌న హిందూ ధర్మాన్ని ఖూనీ చేస్తున్న విధానం గురించి అనంత శ్రీరామ్ గొప్పగా మాట్లాడారని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో మరికొందరు అతను గతంలో రాసిన కొన్ని పాటలను బయటకి తీసి ట్రోల్ చేస్తున్నారు.

'వరుడు కావలెను' సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన "దిగు దిగు దిగు నాగ" పాట వివాదంలో చిక్కుకుంది. నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్ గా మార్చేసారంటూ అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పాట‌లో ‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ లాంటి పదప్రయోగాలు చేయడంపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే తొలగించి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధరమ రక్షాదళ్ సంస్థ డిమాండ్ చేసింది.

అంతేకాదు 'దిగు దిగు దిగు నాగ' పాట రాసిన అనంత శ్రీరామ్ పై బీజేపీ మోర్చా నాయకులు పలు చోట్ల కేసులు పెట్టారు. దేవుడిని కించపరిచేలా లిరిక్స్ రాశాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు మండిపడ్డారు. అనంత శ్రీరామ్‌తో పాటు సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వ్యవహారాన్ని నెటిజన్లు ఇప్పుడు బయటకు తీసుకొచ్చి విమర్శలు చేస్తున్నారు.

అలానే 'య‌మ దొంగ‌' సినిమా కోసం అనంత శ్రీ‌రామ్ రాసిన 'యంగ్.. య‌మా.. యంగ్ య‌మా' అనే ఓ పాటను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. "యంగ్ య‌మా ఇర‌గేసుకో.. కుర్ర య‌మా కుర్ర య‌మా కుమ్మేసుకో.. తుమ్మెదెలే అమృత‌మే జుర్రేసుకో.. య‌మ పోటుగా కోట‌నే దున్నేసుకో.. షేకూ షకలా షేకూ షకాలా.. షేపులన్ని నాకు దక్కాలా.. అప్సరబాల.. సిగ్గువీడి చిందుతొక్కలా'' అంటూ యమలోకం నేపథ్యంలో డబుల్ మీనింగ్ లిరిక్స్ రాసారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. హైందవ ధర్మం గురించి మాట్లాడే అనంత్ శ్రీరామ్ హిందూత్వాన్ని, హిందూ సంప్ర‌దాయాల్నీ కించ‌ప‌రిచేలా అలాంటి సాంగ్స్ ఎలా రాసాడని ప్ర‌శ్నిస్తున్నారు.