అనంత్ అంబానీ లేటెస్ట్ లగ్జరీ వాచ్ ధర మైండ్ బ్లో
ఆసక్తికరంగా ఈ వేదికకు విచ్చేసిన వారంతా విలక్షణమైన ఫ్యాషన్ పోకడలతో మతులు చెడగొట్టారు.
By: Tupaki Desk | 23 July 2024 7:14 AM GMTభారతీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ జంట వివాహ వేడుక ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఈ పెళ్లి కోసం అంబానీలు ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేయడం ఒక సంచలనం. ఈ భూప్రపంచంలో కనీవినీ ఎరుగని రీతిలో చిన్న కొడుకు పెళ్లి చేసారు ముఖేష్ అంబానీ. ఈ ఈవెంట్ లగ్జరీకి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఇది చరిత్రలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటి.
ఈ పెళ్లిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ సెలబ్రిటీలు సందడి చేసారు. పాప్ స్టార్లు, గాయనీగాయకులు, కళాకారులు, కంపెనీల యజమానులు, సీఈవోలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, వినోద రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, దేశాధ్యక్షులు ఇలా అన్ని కేటగిరీల ప్రముఖులు పెళ్లిలో ఓలలాడారు. రాజు గారి సంగీత్ లో నాట్యమాడని ప్రముఖులు లేనే లేరు. దిగ్గజాలంతా డ్యాన్సులు చేసారు. మైమరిచి ఆడిపాడారు. పార్టీల్లో మునిగి తేలారు.
ఆసక్తికరంగా ఈ వేదికకు విచ్చేసిన వారంతా విలక్షణమైన ఫ్యాషన్ పోకడలతో మతులు చెడగొట్టారు. ఒక్కొక్కరూ విలాసవంతమైన కాస్ట్యూమ్స్ వాటికి తగ్గ వాచ్‌లు ధరించి ఔరౌరా అనిపించారు. అయితే వాచ్‌లను అమితంగా ఇష్టపడే వ్యక్తిగా పేరుగాంచిన అనంత్ అంబానీ ధరించిన ఓ కొత్త వాచ్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. 21 కోట్ల ఖరీదైన వాచ్ ధరించిన అంబానీ.. ఇదే వేడుకలో పాల్గొన్న అతిథులకు 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు కానుకగా ఇచ్చారు
వివాహ వేడుకల సందర్భంగా అతడు అసాధారణమైన రెడ్ కార్బన్ TPT రిచర్డ్ మిల్లె RM 57-03 డ్రాగన్ టూర్‌బిల్లాన్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌ని ధరించాడు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వాచ్ విలువ దాదాపు 21 కోట్లు (210 మిలియన్ రూపాయలు). ఇది యూనిక్ స్టైల్, ఫీచర్స్ తో డిజైన్ పరంగా ఎంతో గొప్పది. ఆసక్తికరంగా ఈ పెళ్లిలో అనంత్ తన సన్నిహితులకు ప్రీమియం వాచీలను కూడా అందించాడు. ఈ సెట్లు ఒక్కొక్కటి దాదాపు 2 కోట్లు (20 మిలియన్ రూపాయలు) ఖర్చుతో కొనుగోలు చేసారు. అంబానీ కుటుంబం ప్రత్యేక సందర్భాలలో తమ అనుబంధాన్ని ఆవిష్కరించేందుకు, లోతైన స్నేహ బంధాలను ప్రదర్శించే సంప్రదాయాన్ని కోరుకుంటారు. వారు అతిథులను ఎంతగానో గౌరవించి ప్రేమిస్తారు. విలాసవంతమైన కానుకలను అందిస్తారు.
ఈ పెళ్లి కేవలం సంపదతో వచ్చిన సూపర్ పవర్స్ ని ప్రదర్శించడమే కాకుండా .. అంబానీలలో ఉండే ప్రేమైక గుణం, అవినాభావ సంబంధాలను, బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుంది. కీలక సందర్భాలలో తమ సంపదను ఇతరులతో పంచుకోవాలనే అంబానీ కుటుంబ విశ్వాసాన్ని ఇది చెబుతోంది. కొన్ని తరాలు ఈ పెళ్లి గురించి చర్చించుకునేలా అంబానీలు తమ వైభవాన్ని చాటకున్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పని వారు లేరు.