అనన్యకు అలాంటి ఆఫర్లే ఎందుకు?
'మీకు గ్లామరస్ పాత్రలు, యూత్‌ను ఎట్రాక్ట్ చేసే రోల్స్ ఎందుకు రావడం లేదు' అని తాజా ఇంటర్వ్యూలో అనన్య నాగళ్లకు ఓ ప్రశ్న ఎదురైంది.
By: Tupaki Desk | 22 Oct 2024 6:09 AM GMTఇండియాలోని మిగిలిన సినిమా పరిశ్రమలతో పోల్చుకుంటే తెలుగులోనే లోకల్ అమ్మాయిలకు ఆఫర్లు తక్కువగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు భామలు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. 'మల్లేశం' మూవీతో గ్రాండ్ ఎంట్రీని అందుకున్న ఆమె.. అప్పటి నుంచి తనదైన రీతిలో మార్కును చూపిస్తూ వెళ్తోంది.
అనన్య నాగళ్ల - యువ చంద్ర జంటగా 'పొట్టేల్' అనే సినిమాలో నటించారు. సాహిత్ మొత్కూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పొట్టేలు నేపథ్యంతో రాబోతుంది. ఈ సినిమాను నలభై సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా తీశారు. ప్రచార చిత్రాలు వచ్చిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో అందరూ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'పొట్టేల్' సినిమాను అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్ ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటోంది. ఇలా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ఇందులో భాగంగానే తాజాగా అనన్య నాగళ్ల ఓ చిట్ చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తనకు వస్తున్న సినిమా అవకాశాల గురించి తొలిసారిగా పెదవి విప్పింది.
'మీకు గ్లామరస్ పాత్రలు, యూత్‌ను ఎట్రాక్ట్ చేసే రోల్స్ ఎందుకు రావడం లేదు' అని తాజా ఇంటర్వ్యూలో అనన్య నాగళ్లకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికామె 'వాస్తవానికి అందరిలా నాకు కూడా యూత్‌ఫుల్ రోల్స్ చేయాలని ఉంటుంది. కానీ, చాలా మంది నాకు సీరియస్‌గా, మెచ్యూర్డ్‌గా ఉండే పాత్రలనే ఆఫర్ చేస్తున్నారు. అయినా నాకు దీనిపై ఎలాంటి కంప్లైంట్లు లేవు' అని చెప్పుకొచ్చింది.
ఇదే ఇంటర్వ్యూలో అనన్య నాగళ్ల 'నాకు మంచి పెర్ఫార్మెన్స్ చేసేందుకు వీలు ఉండే రోల్స్‌ను ఆఫర్ చేస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను దానికి తగ్గట్లు కంటెంట్ ఇవ్వడం వల్లే మరిన్ని ఆఫర్లను వస్తున్నాయి. అలా నేను గ్లామరస్ రోల్స్‌కు కూడా దూరం అవుతున్నాను' అని వివరించింది. మొత్తానికి అనన్య నాగళ్ల తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉందని దీని బట్టి అర్థం అయింది.
ఇక, సందేశాత్మక కథతో రాబోతున్న 'పొట్టేల్' మూవీని నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించారు. ఇందులో అజయ్, నోయల్, ప్రియాంక శర్మ కీలక పాత్రలు చేశారు. శేఖర్ చంద్ర దీనికి సంగీతాన్ని అందించారు.