Begin typing your search above and press return to search.

ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ... ఇదే రోజా క్లారిటీ!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 Jan 2024 5:13 AM GMT
ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ... ఇదే రోజా క్లారిటీ!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సమీకరణాలను, కారణాలను పరిగణలోకి తీసుకుంటున్న జగన్... ఇన్ ఛార్జ్ ల మార్పులు, చేర్పులు గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో వైసీపీకి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కథనాలొస్తునాయి.

అయినప్పటికీ జగన్ ఎక్కడికక్కడ ప్లాన్ బీ అమలుచేసుకుంటూ పోతున్నారని చెబుతున్నారు. ఉదాహరణకు కర్నూలు ఎంపీ విషయంలో గుమ్మునూరు జయరాం అలిగిన అనంతరం.. రెండు రోజు ఎదురుచూసిన జగన్ వెంటనే ప్లాన్ బి కి వెళ్ళిపోయారని.. ఇందులో భాగంగా బుట్టా రేణుకను రంగంలోకి దింపబోతున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. మరికొన్ని లోక్ సభ స్థానాల్లో మంత్రులను ఎంపిక చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... నరసరావు పేట నుంచి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయుల స్థానంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆయన... జగన్ ఎక్కడి నుంచి పోటీ అని చెప్పినా తాను రెడీ అని ప్రకటించారు! ఈ సమయంలో... ఒంగోలు లోక్ సభ స్థానానికి నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా పేరు పరిశీలనలో ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ విషయంపై తాజాగా ఆమె స్పందించారు.

అవును... వచ్చే ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నారని కథనాలొచ్చిన వేళ.. అందుకు జిల్లా నేతలు అంగీకరించడం లేదనే చర్చ జరిగింది! చెవిరెడ్డి రాకను స్థానిక నేతలు స్వాగతించడం లేదని.. వారి మాట కాదని పంపితే మ్మొదటికే మోసం వచ్చి, క్రాస్ ఓటింగ్ కు అవకాశం ఉండొచ్చనే కామెంట్లు వినిపించాయి! ఈ నేపథ్యంలో రోజా పేరు తెరపైకి వచ్చింది.

దీంతో ఈ విషయాలపై తాజాగా రోజా స్పందించారు. తిరుపతి జిల్లాలోని తడ మండలం భీములవారిపాళెం టూరిజం రిసార్ట్‌ ల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె... "ఒంగోలు ఎంపీగా రోజా" అనే విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా... తనను ఒంగోలు లోక్‌ సభకు పోటీచేయిస్తారని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో... నగరి ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని.. అందులో భాగంగానే తనను వరుసగా రెండు సార్లు గెలిపించారని.. మంత్రీ అయ్యే అవకాశం కూడా ఇచ్చారని.. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోనూ తాను నగరినుంచే పోటీ చేస్తానని.. మరలా గెలిచి హ్యాట్రిక్ కొడతానని ఆమె వెల్లడించారు. దీంతో... ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై మరోసారి చర్చ మొదలైంది.

కాగా... నగరి నియోజకవర్గం నుంచి 2014లో 858, 2019 ఎన్నికల్లో 2,708 ఓట్ల మెజారిటీతో తెలిచిన రోజా.. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు టూరిజం మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ రోజాకూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబానికి రాజకీయంగా రసవత్తరమైన పోరు నడుస్తూ ఉంటుంది! ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో కూడా తాను నగరినుంచే పోటీచేసి గెలిచి హ్యాట్రిక్ కొడతానంటూ రోజా చెబుతున్నారు.