నోరు విప్పాలి కదమ్మా... ఆమెపై విమర్శలు!
మొత్తానికి అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా లైంగిక వేధింపులు జరిగాయి అనే చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 4 Sep 2024 6:17 AM GMTకేరళ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హేమా కమిటీ రిపోర్ట్‌లో సినిమా పరిశ్రమకి చెందిన ఆడ వారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న హేమా కమిటీ రిపోర్ట్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న సమస్యల గురించి ఇప్పుడు హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తాము గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గురించి చెబుతూ ఉన్నారు. మొత్తానికి అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా లైంగిక వేధింపులు జరిగాయి అనే చర్చ జరుగుతోంది.
హేమా కమిటీ రిపోర్ట్ గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ సమయంలో పలువురు హీరోయిన్స్ తమ అభిప్రాయంను వ్యక్తం చేస్తూ, ఇక ముందు అయిన ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉండవద్దని కోరుకుంటున్నారు. కానీ హీరోయిన్ ఆండ్రియా మాత్రం ఆ కమిటీ రిపోర్ట్ గురించి స్పందించేందుకు నిరాకరించింది. అసలు తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించి విమర్శల పాలు అయింది. ఇటీవల కేరళలో ఒక సినిమా ప్రమోషన్ కోసం పర్యటించిన ఆండ్రియాకు మీడియా నుంచి హేమా కమిటీ రిపోర్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రీలో మీరు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
మలయాళ మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆండ్రియా నో కామెంట్స్ అంటూ అక్కడ నుంచి వెళ్లి పోయింది. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించే ఆండ్రియా ఈ సారి మాత్రం నోరు విప్పేందుకు ఆసక్తి చూపించక పోవడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడే మీడియాలో ప్రచారం జరిగి మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కనుక ఆండ్రియా లాంటి వారు స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఆండ్రియా ఎందుకు స్పందించలేదు, ముందు ముందు అయినా ఆమె నుంచి స్పందన వస్తుందేమో చూడాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు తడాఖా సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత కూడా ఆమె నటించిన పలు తమిళ సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి మంచి పేరును సొంతం చేసుకుంది. తెలుగు లో ఈమెకు మరిన్ని ఆఫర్లు వచ్చినా కూడా తమిళంకే పరిమితం అయ్యింది. ముందు ముందు అయినా తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుని మల్టీ ట్యాలెంటెడ్ అంటూ ఆండ్రియా అనిపించుకుంది.