వీల్ చైర్‌లో సెట్‌కి వచ్చిన డైరెక్టర్
సెట్లో అతడి కాలికి కట్టిన కట్టు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయినా దేనినీ పట్టించుకోకుండా తన పనిలో తాను ఉన్నాడు సదరు డైరెక్టర్. కమిట్ మెంట్ అంటే ఇదే కదా!
By: Tupaki Desk | 10 March 2024 5:21 AM GMTగాయం ఇబ్బంది పెడుతున్నా.. కాలికి కట్టు వేసినా.. అతడు దేనికీ వెరువక చండశాసనుడిలా మొండివాడిలా సెట్స్ కి వచ్చాడు. తనవల్ల షూటింగుకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని భావించి చిత్రీకరణ ప్రారంభించాడు. సెట్లో అతడి కాలికి కట్టిన కట్టు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయినా దేనినీ పట్టించుకోకుండా తన పనిలో తాను ఉన్నాడు సదరు డైరెక్టర్. కమిట్ మెంట్ అంటే ఇదే కదా! అనిపించేలా ఉంది ఈ యాక్ట్.
భూల్ భూలయ్యా-3 సెట్లో దృశ్యమిది. నేడు యువతరం మెచ్చే అత్యంత ఆసక్తికర హారర్ కామెడీ ఫ్రాంచైజీ ఇది. అక్షయ్, బాలన్ ప్రధాన పాత్రల్లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 'భూల్ భూలయ్యా -1' క్లాసిక్ హిట్‌గా రికార్డులకెక్కగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన తారాగణంగా అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్యా 2 థియేట్రికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కార్తీక్ ఆర్యన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమిది. ఫ్రాంచైజీ లో మూడవ భాగం అయిన 'భూల్ భూలయ్యా 3' కీలక భాగం చిత్రీకరణ ఈరోజు ప్రారంభమైంది. కార్తీక్ ఆర్యన్ తన రూహ్ బాబా పాత్రలోకి తిరిగి పరకాయ ప్రవేశం చేయగా, విద్యాబాలన్ మంజూలిక పాత్రను పోషిస్తున్నారు.
ఫ్రాంచైజీ లో అతి భారీ చిత్రంగా చెబుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అయితే ఇంకా పెద్ద విషయం ఏమిటంటే దర్శకుడు అనీస్ బాజ్మీ వీల్ చైర్‌పై సెట్ కి వచ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా 3 చిత్రీకరణలో దర్శకుడు అనీస్ బాజ్మీ కాలికి గాయమై ఆసుపత్రికి తరలించినట్లు ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఈ గాయం చాలా పెద్దదే. కాలిలో స్టీలు ప్లేట్ పెట్టి మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని, లేదంటే సర్జరీకి వెళ్లాలని డాక్టర్ సూచించారు. కానీ ఈ గాయం విధిని మార్చలేదు. అతడు 9 మార్చి 2024 నుండి పనికి కట్టుబడి ఉన్నందున వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సెట్స్ కి వీల్ చైర్‌లోనే వచ్చాడు. పనిలో తన నిబద్ధతకు కట్టుబడి ఉన్నానని నిరూపించాడు.
అనీస్ బజ్మీ తాను ఎందుకు నిర్మాతల దర్శకుడయ్యాడో మరోసారి నిరూపించాడు. అతడు ఎమోషన్స్ ఉన్నవాడు.. ఒదిగి ఉండే దర్శకుడు. చిత్రీకరణ ఆలస్యమైతే వచ్చే ప్రమాదాలు, నిర్మాతల ఆర్థిక పరిమితుల గురించి బాగా తెలిసి వ్యవహరించే దర్శకుడు. అతడు నిర్మాతల డార్లింగ్. నిర్మాతపై ఏ విధంగానూ భారం వేయకూడదనుకుంటాడు. అలాగే భూల్ భులయా 3 దీపావళి 2024 విడుదలకు లైన్‌లో ఉండాలంటే ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేదు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో చిత్రీకరించాల్సి ఉంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నా కానీ, బజ్మి కాలి గాయంతోనే సాహసానికి పూనుకున్నారు.
భూల్ భూలయ్యా 3 ప్రతిష్ఠాత్మక సినిమా. అందుకే నిర్మాతలు తొలి నుంచి తమ సినిమాను చాలా దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. గతంలో విడుదల తేదీని ప్రకటిస్తూ కార్తీక్ ఆర్యన్‌తో కూడిన ప్రోమోను విడుదల చేసారు. ఈ చిత్రంలో నటించే కొత్తవారు, అలాగే ఒరిజినల్ తారాగణం గురించిన వివరాలు చాలా స్పెషల్ గా వెల్లడించారు. ఇది ప్రేక్షకులలో చాలా ఉత్సుకతను పెంచింది. ఇప్పటివరకు అంతా సినిమాకు అనుకూలంగానే ఉంది. ఇప్పుడు మిగిలిన చిత్రీకరణ జూలై నాటికి పూర్తవుతుంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, దీపావళి 2024 విడుదలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతానికి ఈ దీపావళికి పోటీ తీవ్రంగా లేదు గనుక ఇది సేఫ్ రిలీజ్ అని భావిస్తున్నారు.