Begin typing your search above and press return to search.

మార్పులు చేర్పులు లేవుగా దేవరా?

ఇప్పుడు బాబీ డియోల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 July 2024 3:53 AM GMT
మార్పులు చేర్పులు లేవుగా దేవరా?
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "దేవర". బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ ఈ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు బాబీ డియోల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే షూటింగ్ చివరి దశకు చేరుకున్న తర్వాత, సరిగ్గా రెండు నెలల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలోకి కొత్త యాక్టర్ చేరడంపై అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

'దేవర' సినిమాలో సైఫ్ అలీఖాన్‌ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబీ డియోల్ ను సైతం విలన్ రోల్ కోసమే తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ యాక్టర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారని వార్తలు రావడంతో, కొరటాల శివ తన స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తున్నాడేమో అని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. చివరి నిమిషంలో మార్పులు చేసిన సినిమాల రిజల్ట్స్ ను గుర్తు తెచ్చుకుని భయపడుతున్నారు.

కొరటాల దర్శకత్వంలో మెగా ఫాదర్ అండ్ సన్ చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ముందుగా ఈ స్క్రిప్టులో పది నిమిషాల గెస్ట్ రోల్ మాత్రమే ఉంది. కానీ చెర్రీ యాడ్ అయిన తర్వాత అతని పాత్ర నిడివి పెంచారు. జోడీగా హీరోయిన్ ను తీసుకురావడమే కాదు, సాంగ్స్ ఫైట్స్ పెట్టారు. అటు ఇటు చేసి మెగా మల్టీస్టారర్ అనిపించే ప్రయత్నం చేశారు. కానీ బాక్సాఫీసు దగ్గర రిజల్ట్ మాత్రం తేడా కొట్టింది. చిరు సైతం ఇది దర్శకుడి ఛాయిస్ అంటూ కొరటాలనే బాధ్యున్ని చేశారు.

ఇటీవల 'భారతీయుడు 2' సినిమా విషయంలోనూ ఇలానే జరిగింది. శంకర్ ముందుగా ఈ కథను ఒకే మూవీగా తియ్యాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో రెండు భాగాలుగా చెయ్యాలనే ఆలోచన చేయడంతో స్క్రిప్టులో చాలా చేంజెస్ జరిగాయి. ఫలితంగా డిజాస్టర్ గా మారింది. అదే విధంగా ఇప్పుడు 'దేవర' విషయంలో కూడా లాస్ట్ మినిట్ లో ఏమైనా మార్పులు చేస్తున్నారా? అని అభిమానులు సందేహిస్తున్నారు.

అయితే సినిమాలో బాబీ డియోల్ పాత్ర మొదటి నుంచే ప్లాన్ చేయబడిందని, ఇప్పటికిప్పుడు కొత్తగా అనుకున్నది కాదనే టాక్ వినిపిస్తోంది. 'దేవర 1' లో సైఫ్ అలీఖాన్ పాత్ర చనిపోతుందని, పార్ట్-2 లో బాబీ డియోల్ మెయిన్ విలన్ గా కనిపిస్తారని అంటున్నారు. సెకండ్ పార్ట్ లీడ్ కోసమే బాబీతో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారని సూచిస్తున్నారు. కొరటాల శివ ఈసారి స్క్రిప్టు విషయంలో చాలా కేర్ తీసుకున్నారని, అసలు ఈ ప్రాజెక్ట్ కాస్త లేట్ గా సెట్స్ మీదకు వెళ్లడానికి ఇదే కారణమని చెబుతున్నారు. తారక్ తో ఒక గొప్ప చిత్రాన్ని తీశాడని, ఇది దర్శకుడికి స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ అవుతుందని పేర్కొంటున్నారు.

RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవర సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తీస్తున్న చిత్రం కావడంతో, బయటకు చెప్పకపోయినా ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఓ మూలన ఎక్కడో చోట డౌట్ పడుతున్నారు. దీన్ని సవాలుగా తీసుకొని కొరటాల కచ్ఛితంగా పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 27న ఏం జరుగుతుందో చూడాలి.