రూ.600 కోట్ల దర్శకుడి సినిమాకు రూ.6 కోట్లు దిక్కు లేదు
సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ముందు నుంచే ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.
By: Tupaki Desk | 21 Dec 2024 7:30 PM GMTసన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన గదర్ 2 సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం కనీసం వంద కోట్లు రాబట్టడం కోసం కిందామీదా పడుతున్న సమయంలో గదర్ 2 సినిమా ఏకంగా రూ.600 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. బాలీవుడ్ రికార్డ్‌లను బ్రేక్ చేసింది. అలాంటి సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్ శర్మ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. గదర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో గదర్ 3 సినిమాను చేస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించాడు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ముందు నుంచే ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.
గదర్ 3 సినిమా కంటే ముందు తాను గతంలో అనుకున్న సినిమా ఒకటి ఇప్పుడు తీసుకు వచ్చాడు. ఎలాగూ గదర్ 2 సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఆ సినిమాను భారీ మొత్తానికి అమ్మేయాలి అనుకున్నాడు. నానా పటేకర్ ప్రధాన పాత్రలో రూపొందిన వన్ వాస్ సినిమాను అనిల్ శర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. నార్త్ ఇండియాలో పుష్ప 2 ప్రభంజనం కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ వసూళ్లు దుమ్ము లేపుతున్నాయి. మూడో వారంలోనూ కుమ్మేస్తున్నాయి. పుష్ప 2 ముందు వన్ వాస్ నిలువలేక పోయాడు. రూ.600 కోట్ల సినిమాను అందించిన దర్శకుడు అనిల్ శర్మ తన తాజా సినిమాతో ఆరు కోట్ల వసూళ్లు రాబట్టడానికి కిందా మీదా పడుతున్నాడు అంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
గదర్ 2 సినిమా ఇమేజ్ వన్ వాస్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది, పాత చింతకాయ పచ్చడి అంటూ రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. అందుకే ఆ సినిమాను పక్కన పెట్టి పుష్ప 2 కొనసాగుతోంది. పుష్ప 2 సినిమా వసూళ్ల ముందు వన్ వాస్ తేలిపోయింది. సినిమాలో కథను చాలా పేలవంగా చూపించారు. రూ.600 కోట్ల సినిమాతో వచ్చిన దర్శకుడు తదుపరి సినిమాను అదే స్థాయిలో తీయాలి అనుకుంటాడు. కానీ ఇలా చిన్న సినిమాను తీయడం అనేది ఆయన తెలివి తక్కువ నిర్ణయం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ శర్మ సీనియర్ దర్శకుడు అయినా ఈతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన సినిమాలను తీయడంలో విఫలం అవుతున్నారు అనే విమర్శ ఉంది. గదర్ 2 తో ఆ విమర్శను కొట్టి పారేశాడు, గదర్ 3 తో మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు మధ్యలో ఈ సినిమాను తీయడం ద్వారా గదర్ 2 సినిమా గాలి వాటం విజయం అనే విమర్శలు మళ్లీ వస్తున్నాయి. ఈ దెబ్బతో గదర్ 3 సినిమాను తీసే అవకాశాలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి వన్ వాస్ పై చాలా హోప్స్ పెట్టుకున్న మేకర్స్ కి తీవ్ర నిరాశ ఎదురైంది. పుష్ప 2 సినిమా వల్ల మరింత దెబ్బ పడింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.