దశ దిశను మార్చింది దక్షిణాది సినిమాలే: అనీల్ కపూర్
దక్షిణాది సినిమా హవా గురించి మాట్లాడేందుకు బాలీవుడ్ సీనియర్ స్టార్లు వెనకాడటం లేదు
By: Tupaki Desk | 1 March 2024 4:12 AM GMTదక్షిణాది సినిమా హవా గురించి మాట్లాడేందుకు బాలీవుడ్ సీనియర్ స్టార్లు వెనకాడటం లేదు. ఇప్పుడు అదే బాటలో వెటరన్ స్టార్ అనీల్ కపూర్ దక్షిణాది హవా గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రస్థావించారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, పుష్ప చిత్రాలు గొప్ప సినిమాలు అని, మంచి కథలతో తెరకెక్కాయని ప్రశంసించారు. దేశంలోని గొప్ప స్టార్లు అంతా దక్షిణాది రీమేక్ లలో నటించారని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం దక్షిణాది రీమేక్ లలో నటించడమేనని కూడా అనీల్ కపూర్ అన్నారు.
నిజానికి నటుడిగా అనీల్ కపూర్ తొలి అడుగులు పడింది ఒక తెలుగు సినిమాతోనే. ఇంతకుముందు హైదరాబాద్ లో జరిగిన యానిమల్ ప్రీరిలీజ్ వేడుకలో అనీల్ కపూర్ ఈ విషయాన్ని ప్రస్థావించారు.
అనిల్ కపూర్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ఇక్కడే నటించాను. తొలి చిత్రం 'వంశవృక్షం' గొప్ప దర్శకులు బాపు గారి దర్శకత్వంలో చేశాను. నా పునాది దక్షిణాది పరిశ్రమలోనే పడింది. ఇక్కడే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నా రెండో తెలుగు సినిమాగా యానిమల్ విడుదల కావడం ఆనందంగా వుంది. సందీప్ ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాను'' అని అన్నారు. ఇక ఇదే వేదిక వద్దకు విచ్చేసిన మహేష్ ని సూపర్ స్టార్ వేదికపైకి రావాలంటూ అనీల్ కపూర్ లాంటి పెద్ద స్టార్ ఆహ్వానించడం ఆసక్తిని కలిగించింది. మహేష్ సినిమాలోని హిట్ పాటకు అనీల్ కపూర్ డ్యాన్సులు చేసారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ కూడా ఇటీవల దక్షిణాది సినిమాల రీమేక్ లపై ఆధారపడుతున్నారు. దక్షిణాది దర్శకులు సాంకేతిక నిపుణులకు అవకాశాలిస్తున్నారు. పాన్ ఇండియా హిట్లు కొట్టేందుకు వారంతా దక్షిణాది ప్రతిభను కొనియాడుతున్నారు. చాలా సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి విజయాలు సాధించాయి. చాలామంది స్టార్లకు ఇవి కెరీర్ పరంగా బూస్ట్ నిచ్చాయి.