IPL వివాదం.. ట్రోల్స్ పై అనిల్ రావిపూడి ఏమన్నారంటే
కొన్ని రోజుల క్రితం, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ యాక్ట్ చేస్తున్న 'కృష్ణమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
By: Tupaki Desk | 5 May 2024 3:56 AMప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఉన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులతో పాటు యువకులు.. ఐపీఎల్ సందడిలో ఉన్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ గురించి సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా.. ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ హీరోయిన్లు చాందినీ చౌదరి, రాశీ సింగ్ ఐపీఎల్ కు సంబంధించి మాట్లాడి ఫుల్ ట్రోలింగ్ కు గురయ్యారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి పరిస్థితి కూడా ఇదే!
కొన్ని రోజుల క్రితం, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ యాక్ట్ చేస్తున్న 'కృష్ణమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అనిల్ రావిపూడి.. "ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు.. ఈవెనింగ్ సినిమాలకు రండి. కావాలంటే ఐపీఎల్ మ్యాచ్ స్కోర్ ను మొబైల్ లో చూసుకోవచ్చు" అని అన్నారు. దీంతో సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తాయిగా అని అనిల్ రావిపూడి వ్యాఖ్యలకు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు.
సినిమాలు చూడాలంటే డబ్బులు పెట్టాలి.. కానీ క్రికెట్ ను ఫ్రీగా ఇంట్లో చూడొచ్చు.. అంటూ తెగ ట్రోల్ చేశారు. అనిల్ రావిపూడి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఒకరి ఇష్టాయిష్టాలను అలా కించపరచడం కరెక్ట్ కాదని కామెంట్లు చేశారు. తాజాగా ఆ ట్రోల్స్ పై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. నిన్న జరిగిన దాసరి నారాయణరావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ఇంతలో మే 19వ తేదీన కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉందని ఒకరు గుర్తుచేశారు. "ఇటీవల ఐపీఎల్ కోసం మాట్లాడాను. క్రికెట్ ఫ్యాన్ అయిన నేను.. అందరికన్నా ఎక్కువగా హర్ట్ అయ్యాను. ఆ ఈవెంట్ కు వెళ్లేముందు ఓ డిస్ట్రిబ్యూటర్ ను కలిశాను. 'సమ్మర్ లో సినిమాలకు ఎవరూ రావడం లేదు. థియేటర్స్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి' అని ఆయన నాకు చెప్పారు. నేను కూడా అదే ఫ్లోలో అలా మాట్లాడాను" అని అన్నారు.
ఐపీఎల్ చూడండి.. చూసిన తర్వాత టైమ్ ఉంటే సినిమాలు చూసి ఎంకరేజ్ చేయండని తెలిపారు అనిల్ రావిపూడి. ఇది నా హార్ట్ ఫుల్ రిక్వెస్ట్ అని కూడా చెప్పారు. తాను మాట్లాడిన మాటలను అపార్థం చేసుకోవద్దని కోరారు. డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం దర్శకులంతా సిద్ధమవుతున్నారని చెప్పారు. మంచి ప్రోగ్రామ్స్ చేయబోతున్నామని తెలిపారు. మరి క్రికెట్ ఫ్యాన్స్ ఇంతటితో వదిలేస్తారో లేక మళ్లీ కామెంట్స్ చేస్తారో చూడాలి.