పొలిమేర ప్రాంచైజీకి ఆ ఘటన స్పూర్తి!
బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన 'పొలిమేర' ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మొదటి భాగం ఓటీటీ లో మంచి విజయం సాధించింది
By: Tupaki Desk | 17 Nov 2023 6:23 AM GMTబ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన 'పొలిమేర' ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మొదటి భాగం ఓటీటీ లో మంచి విజయం సాధించింది. దీంతో 'పొలిమేర-2'ని నేరుగా థియేటర్లోనే రిలీజ్ చేసి ప్రేక్షకుల్ని మరింత థ్రిల్ చేసారు. ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో కథనాన్ని నడిపిన వైనం విధానం విమర్శకుల ప్రశంసలు తెచ్చి పెట్టింది. పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కిన సినిమా భారీ వసూళ్లని సాధించింది. ఎండ్ లో పొలిమేర కొనసాగింపు ఉంటుందని రివీల్ చేసారు.
దీంతో మూడవ భాగం ఎప్పుడొస్తుందా? అన్న ఎగ్జైట్ మెంట్ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇందులో నటించిన నటీనటులకు..సాంకేతిక నిపుణలకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా దర్శకుడు అనీల్ విశ్వనాధ్ పై బడా నిర్మాణ సంస్థల కళ్లు పడ్డాయి. పొలిమేర-3 ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కథకు స్పూర్తి ఎక్కడ నుంచి అన్న వివరాలు దర్శకుడు రివీల్ చేసాడు.
'గతంలో బ్లాక్ మేజిక్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేయలేదు. 'ఒకే చితిలో రెండు శవాలు' అనే హెడ్డింగ్ తో చాలా కాలం క్రితం వచ్చిన ఒక క్రైమ్ న్యూస్ చూశాను. మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆటో డ్రైవర్ చేతబడి చేసి అమ్మాయిని చంపాడనే అనుమానంతో ఊళ్లో వాళ్లంతా కలిసి అతణ్ణి చంపేసి అదే చితిలో వేసారు.
ఆ వ్యక్తిని గుంపుగా కలిసి చంపడం వలన పోలీస్ కేసు కాకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. చేతబడి అనేది ఉందా? లేదా? అనే విషయం పక్కన పడితే! చేతబడి చేశాడనే అనుమానంతో చంపడం ఏంటి? అనేది నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటన నుంచి నేను ఈ కథను తయారు చేసుకున్నాను. నేను మాత్రం చేతబడి అనేది ఒక మూఢనమ్మకంగానే భావిస్తాను' అని అన్నారు. మొదటి భాగంలోనే కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తీసిన సినిమా రివీల్ చేసారు. కానీ ఆ సంఘటన ఎక్కడ జరిగిందన్నది మాత్రం ఇప్పుడే లీక్ చేసారు.