యానిమల్.. ఈసారి ఎమోషనల్ ట్రాక్
ఇంకా రణ్‍బీర్ ప్రవర్తన నచ్చక మనసులో బాధపడుతున్న రష్మికను రణ్‍బీర్ నచ్చజెప్పేందుకు, బుజ్జిగించేందుకు ప్రయత్నించడం వంటివి కూడా ఎమోషన్స్‌తో చూపించారు.
By: Tupaki Desk | 27 Oct 2023 11:06 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'యానిమల్'పై సినీ ప్రియుల్లో మంచి ఆసక్తి నెలకొంది. అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్‌తో ఫుల్ హైప్ పెంచిన మేకర్స్.. వరుస సాంగ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.
డిసెంబర్ 1 సినిమా రానుండడంతో తాజాగా యానిమల్ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. 'నే వేరే.. నువ్వు వేరే కాదు నేస్తమా' అంటూ సాగే ఈ పాటలో భార్య-భర్తల మధ్య ఉన్న ఎమోషన్స్‌ను బాగా చూపించారు. కర్వా చౌత్ వేడుకలో జల్లెడలో రణ్‍బీర్ ముఖాన్ని రష్మిక చూసే సందర్భాన్ని కూడా చూపించారు. ఇంకా రణ్‍బీర్ ప్రవర్తన నచ్చక మనసులో బాధపడుతున్న రష్మికను రణ్‍బీర్ నచ్చజెప్పేందుకు, బుజ్జిగించేందుకు ప్రయత్నించడం వంటివి కూడా ఎమోషన్స్‌తో చూపించారు. 'గీతాంజలి మళ్లీ నేను తిరిగి వస్తానో లేదో తెలీదు.. ఒకవేళ తిరిగి రాకపోతే నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకు' అంటూ రణ్‍బీర్ అనడం, రష్మిక తీవ్రంగా ఏడుస్తుండటం చూపించి పాటను ముగించారు.
శ్రేయస్ పురానిక్ అందించిన సంగీతం ఎంతో వినసొంపుగా ఉంది. మెలోడియస్‍గా స్వరపరిచారు శ్రేయస్. ఈ పాటను కార్తీక్ ఆలపించారు. అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ కూడా ఆకట్టుకునేలా సాగాయి. ఈ రెండో పాటను ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. హిందీలో సంత్రంగ, తమిళంలో పోగదే, మలయాళంలో నే వేరే నాన్, కన్నడలో నా బేరే.. నీ బేరే అనే పేర్లతో విడుదల అయింది. ఆయా భాషల్లో సింగర్లు, లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు.
కాగా, ఈ చిత్రం తండ్రీ కొడుకుల కథగా అనిపిస్తోంది. కుటుంబం కోసం ఎంత దూరమైనా, ఏమైనా చేసే యువకుడిగా రణ్‍బీర్ నటించారు. ఓ వైపు సాఫ్ట్ పర్సన్‌గా కనిపిస్తూనే.. మరోవైపు ఎంతో వైల్డ్‌గా విలన్లపై విరుచుకుపడ్డారు. రణ్‍బీర్ తండ్రి పాత్రను అనిల్ కపూర్ పోషించారు. బాబీ డియోల్ మరో కీలక పాత్రలో కనిపించారు. టీ-సిరీస్, సినీ1 స్టూడియోస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.